Share News

తగ్గుతూ... పెరుగుతూ గోదావరి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:50 AM

వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది.

తగ్గుతూ... పెరుగుతూ గోదావరి

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

కాటన్‌బ్యారేజ్‌ నుంచి 12.44లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం, జూలై 26: వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది. దీంతో ఎగువున భద్రాచలం వద్ద, దిగువున ధవళేశ్వరం వద్ద ప్రమాదహెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మధ్యాహ్నానికి 2గంటలకు 13.40అడుగుల వరకు తగ్గిన నీటి మట్టం 12గంటలు పాటు నిలకడగా కొనసాగింది. ఆపై స్వల్పంగా పెరుగుతూ 15గంటల వ్యవధిలో 3 పాయింట్లు పెరిగి శుక్రవారం సాయంత్రం 5గంటలకు 13.70అడుగులకు చేరింది. మరలా తగ్గుముఖం పట్టి రాత్రి 7గంటలకు 13.50 అడుగులుగా ఉంది. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 12,44,232 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో భద్రాచలం వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48.60 అడుగులకు చేరుకుంది.

మళ్లీ పెరుగుతున్న గోదావరి, శబరి

చింతూరు, జూలై 26 : తగ్గినట్టే తగ్గిన గోదావరి, శబరి నదులు మళ్ళి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రానికి భద్రా చలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి అతి చేరువగా 48. 60 అడుగులకు చేరుకుంది. ఇక చింతూరు వద్ద శబరి నది 37.5 అడుగులకు చేరింది. దీంతో రహదారులు ఇంకా ముంపులోనే ఉండి రాకపోకలు దాదాపు వారం రోజులుగా స్తంభించిపోయాయి. ముంపు బాఽఽధితులతో పాటు అధికార యంత్రాంగం నాటు పడవలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పలు గ్రామాలకు చెందిన విద్యుత్‌ సరఫరా లైన్లు నీటమునగడంతో విద్యుత్‌శాఖ సిబ్బంది ముంపునకు గురైన విద్యుత్‌ స్థంభాల వద్దకు నాటు పడవలపై చేరుకొని ఆయా స్థంబాలను హైట్‌ టి రైజర్సు ద్వారా ఎత్తు పెంచి విద్యుత్‌ సరఫరా ఇచ్చే దిశగా చర్యలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి జిఎల్‌ఎన్‌వి రాఘవన్‌ బృందం ముంపు ప్రాంతాలలో సందర్శించి పారిశుధ్యం చర్యలు చేపట్టే దిశగా చర్యలు చేపట్టారు. అదే దశలో విస్తృతంగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయించారు.

విద్యుత్‌ సిబ్బంది సాహసం

ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన రామయ్య

రాజమహేంద్రవరం సిటీ, జూలై 26 : ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడానికి రాజమహేంద్రవరం సర్కిల్‌ పరిధిలోని విద్యుత్‌ సిబ్బంది సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. రంపచోడవరం డివిజన్‌కు చెందిన మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం సున్నంపాడు గ్రామానికి విద్యుత్‌ సిబ్బంది వెళ్లి పీడర్‌ లైన్‌పై వెదురు బొంగులు ఇతర చెట్లు పడిపోవడంతో అక్కడ ఆగిపోయిన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. సుమారు 800 మందిజనాభా కలిగిన సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు కాలువను తమ జెఎల్‌ఎమ్‌ కూర రామయ్య విద్యుత్‌ కండక్టర్‌ సహాయంతో దాటి విద్యుత్‌ సరఫరాను అందించినట్లు ఏపీ ఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా రామయ్యను ఎస్‌ఈ అభినందించారు. సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదలు తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 12:50 AM