Share News

ఊరెళ్లాలి..ఓటెయ్యాలి!

ABN , Publish Date - May 09 , 2024 | 01:19 AM

ఊరెళ్లాలి..ఓటెయ్యాలి.. అందరి ఆశ ఇదే.. గోదావరి జిల్లా వాసులంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.. వ్యాపారాలు..ఉద్యో గాలు చేసుకుంటూ సుదూరంగా ఉండిపోయారు. ఒక్క మలికిపురం నియోజకవర్గం నుంచే సుమారు 6వేల మంది హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం..

  ఊరెళ్లాలి..ఓటెయ్యాలి!

పల్లెకు పోదాం.. ఓటును వేద్దాం చలోచలో..

తెలంగాణ నుంచి తరలివస్తున్న ఓటర్లు

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై రైళ్ల రిజర్వేషన్లు ఫుల్‌

స్వస్థలాలకు వచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

బస్సు చార్జీలు పెంపు 8 విమాన చార్జీలు అంతే

పలు నియోజకవర్గాల్లో వలస ఓటర్లకు ప్రత్యేక బస్సులు

(రాజమ హేంద్రవరం- ఆంధ్రజ్యోతి)/పిఠాపురం/ముమ్మిడివరం /రాజమహేంద్రవరం అర్బన్‌, మే 8: ఊరెళ్లాలి..ఓటెయ్యాలి.. అందరి ఆశ ఇదే.. గోదావరి జిల్లా వాసులంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.. వ్యాపారాలు..ఉద్యో గాలు చేసుకుంటూ సుదూరంగా ఉండిపోయారు. ఒక్క మలికిపురం నియోజకవర్గం నుంచే సుమారు 6వేల మంది హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం.. దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 22 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి..అమెరికా, ఆస్ర్టేలియా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.. అయితే ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ కావడంతో ఆయా ప్రాంతాల నుంచి తిరిగి స్వగ్రామాలకు చేరుతున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలకు రిజర్వేషన్లు ఫుల్‌ అయిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మాత్రం తమ సొంత వాహనాల్లో తరలివస్తున్నారు. ఎన్నడూ లేనిది సంక్రాంతికి పండుగకు వచ్చినట్టు ఓట్ల పండుగకు ఊరెళ్లాలి..ఓటెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున పల్లెబాట పట్టారు. అన్ని రూట్లు ఓటు వైపే వస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారితో పాటు విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు సైతం ఓటు వేసేందుకు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇలా వచ్చేవారి సంఖ్య రెండు రెట్ల కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్‌ కాగా బస్సు, విమాన టిక్కెట్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని అసోసియేషన్లు ఇప్పటికే ఉద్యోగుల కోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. వీటితోపాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వలస ఓటర్లపై దృష్టిసారించి ప్రత్యేకంగా బస్సులు పురమాయిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం, ఏపీని కాపాడుకోవాలన్న లక్ష్యం ప్రతి ఒక్కరిలోనూ అధికమైన నేపథ్యంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఈసారి స్వస్థలాల్లో ఓటు వేయాలనే కృతనిశ్చయానికి వచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధికంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణే తదితర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉన్నారు. ప్రవాసాంధ్రుల ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఫోన్ల ద్వారా వీరిని సంప్రదించి ఓటు వేసేందుకు రావాలని కోరారు. ఇప్పటికే వీరు ఓటు వేసేందుకు స్వస్థలాలకు రావాలని నిర్ణయించుకోవడం, శని, ఆదివారాలు సెలవు కావడం, పోలింగ్‌ జరిగే మే 13న సెలవు ప్రకటించడంతో ఇంటికి వచ్చి మూడు రోజులు గడిపినట్టు ఉంటుందని అందరూ ప్రయాణాలకు సిద్ధమయ్యారు.

రైళ్లన్నీ ఫుల్‌

13న పోలింగ్‌ కావడంతో వచ్చే వారంలో రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే నిండుకున్నాయి. తెలం గాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని వచ్చే రైళ్లల్లో రిజర్వేషన్లు అన్నీ ఇప్పటికే ఫుల్‌ అయ్యాయి. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోం ది. ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీ కాగా.. 11న రెం డో శనివారం, 12న ఆదివారం సెలవులు కలిసి రావడంతో సికింద్రాబాద్‌ నుంచి 10వ తేదీ నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో రిజర్వేషన్లు అ యిపోయాయి. 10,11,12 తేదీల్లో వందే భారత్‌ 170, విశాఖ వందేభారత్‌ 133, షాలిమార్‌ వీక్లీ 172, షిర్డీ 120 వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఉమ్మడి జిల్లావాసులు హైదరాబాద్‌కి ఎక్కువగా రాకపో కలు సాగించే గోదావరి, ఫలక్‌నుమా, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల్లో 400 వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండగా.. 11, 12, గౌతమికి రిజర్వేషన్లు లేవు. కోకనాడ ఎక్స్‌ ప్రెస్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ 180 దాటింది. గరీబ్‌రథ్‌ కు 10న అసలు రిజర్వేషన్లు లేవు. 11న 300, 12న 295 వెయిటింగ్‌ లిస్టు ఉంది. కోణార్క్‌కి 12 వరకు రిజర్వేషన్లు అయిపోయాయి.

ఎన్‌ఆర్‌ఐలు వస్తున్నారు..

ఈ సారి ఎన్నికల్లో విదేశాల్లో ఉంటున్న జిల్లాకు చెందిన వారు ఓటు వేసేందుకు ప్రత్యేకంగా స్వస్థలాలకు వస్తున్నారు. వీరు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకుని విమానాల్లో వచ్చి ఓటు వేసి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులతో వారం పది రోజులు గడిపేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌తో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి అధికంగా వస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వారే సుమారు వెయ్యి మంది వరకూ ఓటు వేసేందుకు స్వదేశానికి వస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్‌పోర్ట్‌ గత వారం రోజులుగా కిటకిటలాడుతోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సంఘటనలు అందరినీ కలచివేయడంతో పాటు ఇలాగే ఉంటే మన భావితరాల భవిష్యత్తు ఏమిటనే ఆలోచన అందరినీ ఓటు వేయాలనే సంకల్పం వైపు నడిపిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. గతంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు కేవలం 20 నుంచి 40 శాతం మంది మాత్రమే వచ్చి ఓటు వేసేవారు. ఈసారి అది 80-90 శాతం వరకూ ఉంటుందని అంచనా.

ఎన్నికల కోసం ఆర్టీసీ బస్సులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి తరలివచ్చే ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈనెల 9వ తేదీ నుంచి సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఈ స్పెషల్‌ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఓటర్లను ఇక్కడకు తీసుకురానున్నారు. 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా మరో రెండు, మూడు రోజులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ స్పెషల్‌ సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులకు ఈ స్పెషల్‌ సర్వీసులు అదనం కానున్నాయి. స్పెషల్‌ సర్వీసులకు టిక్కెట్‌ ధరలు సాఽధారణంగానే ఉంటాయని, అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని ఆర్టీసీ డీఎం షబ్నం తెలిపారు.

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు హైదరాబాద్‌ కేం ద్రంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్‌ వింగ్‌ సహా వివిధ అసోసియేషన్లు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఐటీతో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో కార్లు, ఇతర వాహనాలను ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగస్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీరితో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని పంచుకుంటున్నారు.

ప్రైవేటు బస్సుల చార్జీలు భారీగా పెంపు

రైళ్లల్లో రిజర్వేషన్లు ఫుల్‌ కావడంతో ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు బస్సు చార్జీలను భారీగా పెంచేశారు. గతంలో రూ.750 నుంచి రూ.1,000 వరకు ఉన్న చార్జీలు ఇప్పుడు రూ.2,100 నుంచి రూ.3 వేల వరకూ పెరిగాయి. ఈ ధరల్లో కూడా టిక్కెట్‌లు అందుబాటులో ఉండని పరిస్థితి ఉంది. హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరానికి సాధారణ రోజుల్లో రూ.3,500 ఉన్న విమాన టిక్కెట్‌ ధర 10,11,12 తేదీల్లో బుధవారం సాయంత్రానికి రూ.7,900 నుం చి రూ.9,000 వరకూ ఉన్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైళ్లు, బస్సుల్లో తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ మంది సొంత వాహనాలపై వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రెండు, మూడు కుటుంబాలు కలిసి ఒకే వాహనంలో వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలింగ్‌ రోజున మాత్రం రిజర్వేషన్లు ఖాళీ ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాల్లోని ముఖ్యంగా సామర్లకోట, కాకినాడ, రాజ మహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కి 13, 14 తేదీల్లో విపరీత మైన రద్దీ ఉంది.

వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండడంతో అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేయడంలో వలస ఓటర్లు కీలకం కానున్నారు. దీంతో వలస ఓటర్లపై దృష్టి సారించిన అభ్యర్థులు తమకు అనుకూలమైన ఓటర్లను కూడగట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాలకు జీవనోపాధికి వలస వెళ్లిన వారు ఉన్నారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ల్లో అధికంగా ఉంటున్నారు. టిఫిన్‌ సైకిళ్లు, హోటళ్లు, ఇళ్లల్లో పనులు, అపార్టుమెంట్లలో, భవన నిర్మాణ కార్మికులు, చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ మంది జీవిస్తున్నారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వలస ఓటర్లను రప్పించే ప్రయత్నాలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ముమ్మరం చేశారు. సామాన్య ఓటర్లకు ప్రత్యేక బస్సులు, ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే ఓటరుకు బస్సు చార్జీలు చెల్లిస్తునట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గంలో 8వేల మందికిపైగా వలస ఓటర్లు తెలంగాణలో ఉండడంతో వారి ఓట్లు అభ్యర్థి గెలుపుకు కీలకమయ్యే అవకాశం గెలిపిస్తుంది. దీంతో ఆయా పార్టీలు సానుకూల ఓటర్లను ఓటింగ్‌కు రప్పించే చర్యలు చేపట్టారు.

నెల కిందటే ప్లాన్‌ చేసుకున్నా...

నా పేరు వంశీ.. మాది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం.. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా.. నెల కిందటే ఎన్నికలకు వచ్చేందుకు ప్లానింగ్‌ చేసుకున్నా.. అందుకే ముందస్తుగా రిజర్వేషన్‌ చేయించుకున్నా.. నేను బుధవారం రావులపాలెం వచ్చేశా.. నాతో పాటు రాజమహేంద్రవరం, తునికి చెందిన స్నేహితులు ఉన్నారు.. 12వ తేదీకి వచ్చేందుకు ప్లానింగ్‌ చేసుకున్నారు. అయితే వారికి రిజర్వేషన్‌ లేదు.. ఎలా వస్తారో చూడాలి మరి.

- గంగిదేశి వంశీ మణికంఠ, రావులపాలెం

Updated Date - May 09 , 2024 | 01:19 AM