Share News

జనసేనతో జతకు సిద్ధం

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:33 AM

రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు.

జనసేనతో జతకు సిద్ధం

  • కూటమి నాయకులతో మంతనాల్లో బిజీబిజీ

  • అన్నీ కుదిరితే నేడే.. లేకుంటే అతి త్వరలో ..

నిడదవోలు, జూలై 26: రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు. వైసీపీని వీడేందుకు నాయకులతో పాటు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిడదవోలు పురపాలక సంఘంలోని వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు జనసేనతో జతకట్టేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. నిడదవోలు పురపాలక సంఘానికి 2021లో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరగ్గా 28 వార్డులకు గాను ఒక్క వార్డులోనే టీడీపీ విజయం సాధించగా మిగతా వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి పాలకవర్గం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు నేను రాజు.. నేనే మంత్రి.. అన్న రీతిలో వ్యవహరించారు. కౌన్సిల్‌ సమావేశాల్లో సైతం కౌన్సిలర్లు పట్టణ సమస్యలను కూడా ప్రస్తావించలేని పరిస్థితుల్లో అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతోనే సరిపోయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కందుల దుర్గేష్‌ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పలువురు కౌన్సిలర్లు కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు కూటమి నాయకులతో మంతనాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో చైర్మన్‌ గిరి సైతం కూటమికే వచ్చే దిశగా ఒక ముఖ్య నాయకుడు పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం నిడదవోలులో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నెల 27న(నేడు) పురపాలక సంఘ కౌన్సిల్‌ హాలులో జరిగే సాధారణ సమావేశానికి మంత్రి హాజరు కానున్నారనే సమాచారంతో ఆయన సమక్షంలో పలువురు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్నీ కుదిరితే కౌన్సిల్‌ సమావేశంలోనే ఇది జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లేని పక్షంలో త్వరలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:06 AM