Share News

ప్రత్తిపాడులో వైద్య ఉద్యోగి ఇంట్లో చోరీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:06 AM

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

ప్రత్తిపాడులో   వైద్య ఉద్యోగి ఇంట్లో చోరీ

రూ.7లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరణ

ప్రత్తిపాడు, జూలై 26: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. పోలీసు లు తెలిపిన వివరాలు ప్రకారం ప్రత్తిపాడులోని ఫైర్‌స్టేషన్‌ సమీపంలో వైద్య ఉద్యోగి మచ్చికర్ల అప్పలస్వామి, భార్య సత్యకాంత ఇరువురు పిల్లలతో డాబా ఇంట్లో నివసిస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పీహెచ్‌సీలో మచ్చకర్ల అప్పలస్వామి ఫార్మశిస్టుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంటివద్ద ఉన్న అతని భార్య సత్యకాంత స్థానిక బస్టాండ్‌ సమీపంలోని తన తల్లి నిర్వహిస్తున్న దుకాణం వద్దకు వెళ్లింది. అదే సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరిచిన రూ.3లక్షల నగదుతోపాటు రూ.4లక్షలు విలువచేసే 12రకాల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. డాబాపై ఫస్ట్‌ప్లోర్‌ నిర్మాణ పనులు ఒక వైపు జరుగుతున్నా కింది ఫ్లోర్‌లో తలుపులకు తాళాలు వేసినా దుండగలు చాకచక్యంగా లోపలకి వెళ్లి ఈ చోరీకి పాల్పడ్డారు. ఇందుకూరుపేట పీహెచ్‌సీ నుంచి అప్పల స్వామి ప్రత్తిపాడు చేరుకుని తన ఇంటిపై జరుగుతున్న నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళుతూ కిటికీలోంచి బెడ్‌రూంలోని వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గమనించి మెయిన్‌ డోర్‌ తాళాలు తీసి పరిశీలించగా చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న రూ.3లక్షల నగదుతో పాటు రూ.4లక్షలు విలువచేసే 20 కాసుల బంగారు నెమలి లాకేట్‌, రెండు రకాల నల్లపూసలతాళ్లు, రెండు రకాల చెవిదిద్దులు, బ్రాస్‌లెట్‌లు, చైన్‌లు, మూడు ఉంగరాలు, రెండు రూపులు, గ్రీన్‌స్టోన్‌ చెవిదిద్దులు తదితర వస్తువులు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పట్టపగలు తమ ఇంట్లో మూసిన తలుపులు మూసినట్లు వేసిన తాళాలు వేసినట్లు ఉండగా దుండగలు ఏ విధంగా చోరీకి పాలపడ్డారో అర్ధం కావడంలేదని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని శుక్రవారం సాయంత్రం పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, ప్రత్తిపాడు సీఐ శేఖర్‌బాబు, ప్రత్తిపాడు, ఏలేశ్వరం ఎస్‌ఐలు ఎం.పవన్‌కుమార్‌, జి.సతీష్‌లు సందర్శించారు.కాకినాడ నుంచి క్లూస్‌ టీం, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:06 AM