Share News

AP Elections: తాడిపత్రి, పల్నాడు జిల్లాలో అల్లర్లపై బిగ్ అప్డేట్.. భారీగా పోలీసు బలగాలు మోహరింపు

ABN , Publish Date - May 18 , 2024 | 09:54 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...

AP Elections: తాడిపత్రి, పల్నాడు జిల్లాలో అల్లర్లపై బిగ్ అప్డేట్.. భారీగా పోలీసు బలగాలు మోహరింపు

అనంతపురం/అమరావతి, ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. తాడిపత్రి అల్లర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో సిట్‌ విచారణ జరుగుతోంది. సిట్ అధికారుల పర్యటనతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. మరీ ముఖ్యంగా అటు పెద్దారెడ్డి, ఇటు జేసీ వర్గాలు దాడులు చేసుకోకుండా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ప్రస్తుతం పోలింగ్ సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. రాత్రి నుంచి తాడిపత్రి ఓంశాంతి నగర్‌లో సిట్ అధికారుల పర్యటిస్తున్నారు. అంతకుముందు తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సిట్‌ బృందం ఎఫ్ఐఆర్‌లను నిశితంగా పరిశీలించింది. అయితే.. స్టేషన్‌లోకి మీడియాను పోలీస్ అధికారులు అనుమతించలేదు. అంటే అత్యంత గోప్యంగానే ఇదంతా జరుగుతోందని చెప్పుకోవచ్చు.


SIT.jpg

వేట మొదలైంది..!

మరోవైపు.. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పర్యటించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లుగా తెలిసింది. ముఖ్యంగా జిల్లాలోని మాచర్ల, నర్సారావుపేటలో అధికారులు కీలక ఆధారాలతో పాటు సమాచారం కూడా రాబట్టినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా.. గురజాల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై 192 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అటు టీడీపీ.. ఇటు వైసీపీ కార్యర్తలు, నేతలు కూడా ఉన్నారు. అంతేకాకుండా.. ఇరుపార్టీలకు చెందిన పలువురిని అదుపులోనికి తీసుకొని 41ఏ నోటీసులను పోలీసులు జారీచేస్తున్నారు. పలువురిపై 307, 323, 324 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కారంపూడి అల్లర్లకు సంబంధించి టీడీపీకి చెందిన 11 మంది, వైసీపీ చెందిన 11 మంది కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగింది. దీనికి తోడు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కొంతమంది అధికారులను సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు,70 మంది నిందితులను.. పెదకూరపాడు నియోజకవర్గంలో 05 కేసులు, 99 మంది నిందితులను.. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు, 60 మందిని నిందితులుగా చేర్చారు. మరో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే ఇప్పుడిప్పుడే అటు పోలీసులు.. ఇటు సిట్ వేట మొదలైందన్న మాట.

YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?



Karampudi-Police-Station.jpg

వైసీపీలో వణుకు!

కాగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సారావుపేట.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు దర్యాప్తు చేసి.. ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికారులు పంపనున్నారు. దీంతోపాటు.. ఈ అధికారుల బృందం ముందుగా హింస్మాత్మక ఘటనలపై నమోదైన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లను పున: సమీక్షించనుంది. అయితే ఈ దర్యాప్తుతో అధికార వైసీపీ నేతల్లో వణుకు మొదలైనట్లు సమాచారం. ఎందుకంటే.. భారీగా మారణాయుధాలు, నాటు బాంబులు, పెట్రోలు బాంబులు, ఖాళీ సీసాలు పోలీసుల తనిఖీల్లో లభ్యమైన సంగతి తెలిసిందే. పల్నాడు, కారంపూడి, పిన్నెల్లి సహా పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేసి ఇప్పటికే భారీ ఎత్తున మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లాలో దర్యాప్తు పూర్తవ్వగానే తిరుపతి జిల్లాకు సిట్ బృందం వెళ్లనుంది. ఇలా మూడు జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత నిశితంగా ఈసీకి అధికారులు నివేదిక పంపనున్నారు.

SIT-Team.jpg

AP Elections: ఎన్నికల గొడవల తర్వాత ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై నిషేధం


Updated Date - May 18 , 2024 | 10:10 PM