AP Elections: ఆ ఓట్లపైనే ఫోకస్.. ఆకర్షించేందుకు పోటీపడుతున్న పార్టీలు..
ABN , Publish Date - Apr 29 , 2024 | 01:01 PM
ఏపీలో రాజకీయ పార్టీలు యువత జపం చేస్తున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతికి చెందిన వృద్ధులు, మహిళల్లో ఎక్కువమంది ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారు. మరోవైపు ఉద్యోగులు, వేతన జీవులు సైతం ఓటు ఎవరికి వేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో యువత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మొదటిసారి ఓటు వేయనున్న వారి సంఖ్య దాదాపు 10.3 లక్షలు కావడంతో.. వీరి ఓట్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.
ఏపీలో రాజకీయ పార్టీలు యువత జపం చేస్తున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతికి చెందిన వృద్ధులు, మహిళల్లో ఎక్కువమంది ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారు. మరోవైపు ఉద్యోగులు, వేతన జీవులు సైతం ఓటు ఎవరికి వేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో యువత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మొదటిసారి ఓటు వేయనున్న వారి సంఖ్య దాదాపు 10.3 లక్షలు కావడంతో.. వీరి ఓట్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. సాధారణంగా మొదటిసారి ఓటర్లలో ఎక్కువ మంది చదువుకున్నవాళ్లు ఉంటారు. వాళ్లంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనించి ఓటు వేసే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. దీంతో మొదటిసారి ఓటు వేసే యువతను రాజకీయపార్టీలు టార్గెట్ చేశాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొనడంతో యువత ఆలోచన ధోరణి మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అధికార వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ టైమ్ ఓటర్లలో దాదాపు 90 శాతం మంది ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ టైమ్ ఓటర్లు ఎక్కువ మంది కేంద్రంలో మోదీ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపే ఫస్ట్ టైమ్ ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
నిరుద్యోగమే ప్రధాన సమస్య..
యువ ఓటర్లు వైసీపీకి దూరం కావడానికి ప్రధాన కారణం నిరుద్యోగంగా తెలుస్తుంది. మొదటిసారి ఓటు హక్కు పొందిన వారిలో ఎక్కువమంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవాళ్లే. వీరిలో అధిక శాతం మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్లే. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత తమకు ఉద్యోగం వచ్చే పరిస్థితులు లేకపోవడంపై యువ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతోనే ఉద్యోగాలు రావడం లేదనే ఆలోచనలో యువ ఓటర్లు ఉన్నారట. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఓట్లు వేసే అవకాశం ఉంది. ఉద్యోగాల కల్పనకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే.. దీంతో డిగ్రీలు పూర్తిచేసిన తర్వాత ఖాళీగా ఉండాల్సి వస్తుందని ఎక్కువ మంది యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిపై..
ఏపీ రాజధాని ఏమిటంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండటం, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయకపోవడంపై యువత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ మహానగరాన్ని రాజధానిగా ప్రకటించడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఒక కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ సమీప ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా.. కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందవనే అభిప్రాయంలో యువత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఎక్కువ మంది యూత్ వైసీపీపై వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News