Share News

Mukesh Kumar Meena : పిన్నెల్లిపై ఈసీ సీరియ్‌సగా ఉంది

ABN , Publish Date - May 24 , 2024 | 06:19 AM

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్‌సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు.

Mukesh Kumar Meena : పిన్నెల్లిపై ఈసీ  సీరియ్‌సగా ఉంది

పరామర్శ కోసం మాచర్లకు

టీడీపీ వెళ్లకుంటే మంచిది

సీఈవో మీనా సూచన

లెక్కింపునకు పటిష్ఠమైన

ఏర్పాట్లు చేయాలి

ఎన్నికల అధికారులతో

వీడియో కాన్ఫరెన్స్‌

నిర్లక్ష్యంగా ఉన్న పీవో, ఏపీవోల సస్పెన్షన్‌కు ఆదేశించాం

ఎన్నికల ప్రధానాధికారి మీనా వెల్లడి

జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్‌సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు. మాచర్లలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశించామని చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లో అదనపు ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలతో కూడిన ఎనిమిది బృందాలు పని చేస్తున్నాయన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం ఇప్పుడు మంచిది కాదని సూచించారు. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని వివరించారు. టీడీపీ నేతలు వెళితే పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉందన్నారు.

రేపటి నుంచి స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన

ఈ నెల 25వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌ రూంల పరిశీలన జరపనున్నట్టు మీనా తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని, కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.


ఆ వీడియో ఆధారంతో చర్యలా?: సజ్జల

మాచర్ల జిల్లా పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ సామాజిక మధ్యమంలో వచ్చిన వీడియో నిజమైందో కాదో నిర్ధారించుకోకుండానే చర్యలకు ఎలా దిగుతారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ ఆ వీడియో నిజమైనదే అయితే.. అది సోషల్‌ మీడియాలోకి ఎలా వచ్చిందని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు.

సత్తెనపల్లిలో 500 మంది బైండోవర్‌

సత్తెనపల్లి, మే 23: పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ సర్కిల్‌ పరిధిలో 500 మందిపై బైండోవర్‌ కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్‌ మండలాల పరిధిలో ఈ కేసులు పెట్టినట్లు సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు గురువారం విలేకరులకు తెలిపారు. వీరిలో కొంత మంది ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో కూడా ఉన్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గురజాల నియోజకవర్గంలో 84 మందికి రిమాండ్‌

నరసరావుపేట లీగల్‌, మే 23: పోలింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి గురువారం 84 మంది నిందితులకు స్థానిక ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు రిమాండ్‌ విధించింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో 33 మంది, పిడుగురాళ్లలో 50 మంది, నరసరావుపేటలో ఒక్కరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని గురువారం గురజాల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, పిడుగురాళ్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల ఇన్‌చార్జి న్యాయమూర్తి ఆర్‌.ఆశీర్వాదం పాల్‌ ఎదుట హాజరుపరచగా.. ఆయన వారికి రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 24 , 2024 | 06:22 AM