Share News

అప్పులపై వైసీపీ చె ప్పేవన్నీ తప్పులే!

ABN , Publish Date - Nov 19 , 2024 | 04:04 AM

‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.

అప్పులపై వైసీపీ చె ప్పేవన్నీ తప్పులే!

  • 10 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది

  • సూపర్‌ సిక్స్‌కి నిధులు కేటాయించాం: పయ్యావుల

  • ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌: బొత్స

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది. ఇలాంటి చర్యలకు చైనాలో అయితే ఉరి తీసేవారు’ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ‘తల్లికి వందనం పథకం కోసం రూ.6,484.75 కోట్లు కేటాయించాం. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆర్థిక విధ్వంసం, అరాచకత్వం జరిగింది. గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. అప్పులపై వైసీపీ చెప్పేవన్నీ తప్పులే’ అని విమర్శించారు.

ఎగనామం పెట్టేందుకే!: బొత్స

తొలుత మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఈ బడ్జెట్‌ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌’ అని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులే లేవన్నారు. హామీలకు కేటాయింపులేని మోసపూరిత బడ్జెట్‌ అంటూ విమర్శించారు. పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు లేవని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని దీనికి నిరసనగా వాకౌట్‌ చేస్తున్నామని చెప్పి, వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

మా గురించి ఒక్క మాటా లేదు: పీడీఎఫ్‌

రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల గురించి ఒక్క మాటా లేదని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. పీఆర్సీ, డీఏలు ఇవ్వలేదన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 04:05 AM