AP: జత్వానీ కేసులో తొలి అరెస్ట్.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:44 PM
ముంబయి నటి కాదంబరీ జత్వానీ(kadambari jatwani) కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి: ముంబయి నటి కాదంబరీ జత్వానీ(kadambari jatwani) కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు పోలీసు ఉన్నత స్థాయి అధికారులను సస్పెండ్ అయిన విషయం విదితమే.ఐపీఎస్ అధికారి కాంతి రాణా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండైన కాంతి రాణా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. గురువారమే నటి జత్వానీ ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి భావోద్వేగానికి గురయ్యారు.
రెండ్రోజుల క్రితమే వేటు..
కాదంబరీ జత్వానీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్సైట్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబయి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిరబంధఇంచారని ఆమె పేర్కొన్నారు. తన పూర్వాపరాలు, ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గన్ని ద్వారా ఆరా తీయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని కాదంబరి కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాసాగర్‌ను కూడా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని త్వరలోనే విచారించే అవకాశం ఉంది.