Share News

ఉపాధి కోసం వెళ్లి.మృత్యువుతో పోరాటం

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:22 AM

అసలే కూలి బతుకులు. పనులు కూడా సక్రమంగా లేక అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ పస్తులుండక తప్పేది కాదు. దీంతో భార్యా పిల్లలను సంతోషంగా చూసుకోవాలని అప్పులు చేసి కోటి ఆశలతో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు.

ఉపాధి కోసం వెళ్లి.మృత్యువుతో పోరాటం

  • సౌదీలో గాయపడి ఆస్పత్రిపాలు

  • వైద్యం కోసం కోనసీమవాసి ఎదురుచూపులు

  • స్వదేశానికి రప్పించి కాపాడాలని భార్య వేడుకోలు

రావులపాలెం, అక్టోబరు 11: అసలే కూలి బతుకులు. పనులు కూడా సక్రమంగా లేక అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ పస్తులుండక తప్పేది కాదు. దీంతో భార్యా పిల్లలను సంతోషంగా చూసుకోవాలని అప్పులు చేసి కోటి ఆశలతో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అయితే అనుకోకుండా ఒక ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలై చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో ఇక్కడ ఆ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాలివీ.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన సానబోయిన సాయిబాబా రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆయనకు భార్య తేజశ్రీ, నాలుగేళ్ల యశ్విత అనే పాప ఉన్నారు. ఇటీవల సౌదీలో పనిచేస్తుండగా సాయిబాబా తలపై ఇటుక పడడంతో తలకు, మెడ నరాలకు తీవ్ర గాయాలయ్యాయి.

అక్కడి వైద్యులు పరీక్షించి ఆపరేషన్‌ చేయాలని, అందుకు రూ.15లక్షలు అవుతుందని తెలిపారు. దీంతో స్తోమత లేకపోయినా కొంత అప్పుచేసి సొమ్ము పంపగా సాయిబాబా ఆస్పత్రిలో చేరాడు. పూర్తిస్థాయిలో వైద్యానికి ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఇక్కడ తేజశ్రీ రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. సౌదీ ఆసుపత్రిలో ఉన్న తన భర్తను స్వదేశానికి రప్పించి కాపాడాలంటూ ఆమె కన్నీళ్లతో వేడుకుంటోంది. ఆమె శుక్రవారం తన కుమార్తెలను వెంటబెట్టుకుని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, అమలాపురం ఎంపీ గంటి హరీ్‌షమాధుర్‌లను కలిసి భర్త పరిస్థితిని వివరించింది. దీనిపై వారు స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి లోక్‌శ్‌ దృష్టికి తీసుకువెళ్లి సాయిబాబాను రప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Oct 12 , 2024 | 04:23 AM