Share News

బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగంలో గందరగోళం

ABN , Publish Date - May 09 , 2024 | 02:09 AM

జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం గందరగోళంగా మారింది. ఎన్నికల సం ఘం స్పష్టంగా తొలి రెండు రోజులు పీవోలు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించింది.

 బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగంలో గందరగోళం

ఉద్యోగులకు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన బేఖాతరు

ఎలక్షన్‌ కమిషన్‌ అథారిటీ లెటర్స్‌ లేకపోయినా పీబీల మంజూరు

గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం గందరగోళంగా మారింది. ఎన్నికల సం ఘం స్పష్టంగా తొలి రెండు రోజులు పీవోలు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించింది. 7, 8 తేదీల్లో ఓపీవోలు, అత్యవసర సేవల్లో ఉన్న వారికి అవకాశం కల్పించమని స్పష్టం చేసింది. అలానే ఉద్యోగుల్లో ఎవరైతే నిర్ణీత సమయానికి ఫారం-12 ఇవ్వ లేదో వారంతా ఎక్కడైతే ఓటు ఉందో అక్కడి ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లి స్పాట్‌లో ఫారం-12 ఇచ్చి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియో గించుకోవాలని పేర్కొన్నది. ఇందుకోసం ఒక రోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ని కూడా ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు కిందిస్థాయికి సక్రమంగా వెళ్ల లేదు. దీంతో రెండు రోజుల నుంచి జిల్లాలో పలుచోట్ల ఉద్యోగులే కాకుండా ఎవరు పడితే వారు ఫెసిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లి ఫారం-12 ఇచ్చి స్పాట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ పొంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. దీని వల్లనే పశ్చిమలో పోస్టల్‌ బ్యాలెట్‌ అన్ని అయిపోగా ఇక నుంచి వచ్చేవారికి స్పెషల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

కొంతమందికి వారం క్రితం డ్యూటీలు వేయడంతో వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు ఈసీ అనుమతించింది. అయితే వారు పని చేస్తున్న ప్రదేశంలో కాకుండా ఓటు ఉన్న నియోజకవర్గం ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడ ఆర్‌వోకు ఫారం-12 ఇచ్చి పోస్టల్‌ బ్యాలెట్‌ పొంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇదే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా చెప్పారు. ఈ అవకాశం కేవలం ఉద్యోగులకు మాత్రమేనని చెప్పారు. అత్యవసర సేవల్లో పని చేసే వారికి లేదని స్పష్టం చేశారు.

అయితే ఆ నిబంధనని ఆర్‌వోలు, ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులు ఏ విధంగా అర్థం చేసుకొన్నారో కాని రెండు రోజుల నుంచి ఎవరొచ్చి ఫారం-12 ఇచ్చినా తీసుకొని వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. బుధవారం గుంటూరు పశ్చిమలో ఒక వ్యక్తి ఎలాంటి ఎలక్షన్‌ కమిషన్‌ అథారిటీ లెటర్‌ లేకుండానే వచ్చి ఫారం-12 తీసుకొని పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకొనేందుకు ప్రయత్నించగా టీడీపీ ఏజంట్లు అడ్డుకొన్నారు. అయితే అప్పటికే చాలామంది ఓట్లు వేసేశారు. ఎన్నికల విధులతో సంబంధం లేని వారు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌లు పొందారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఫెసిలిటేషన్‌ సెంటర్లలోని సిబ్బంది ఎవరైతే ఓటు వేసేందుకు వచ్చారో వారి అథారిటీ లెటర్స్‌ని తనిఖీ చేయకపోవడమే. దీనిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

18,811 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో 18,811 మంది ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. దీనిని పరిగణన లోకి తీసుకొంటే 77.97 శాతం మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు, అత్యవసర సేవల్లో పని చేసే వారు ఓటుహక్కుని వినియోగించుకొన్నట్లు అయింది. జిల్లాలో మొత్తం 24,125 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. వీరికి తోడు 7, 8 తేదీల్లో స్పాట్‌ పీబీలు మంజూరు కూడా చేశారు.

మలి విడత హోం ఓటింగ్‌కు కొత్త బాక్సుల వినియోగం

గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారం భమైన మలివిడత హోం ఓటింగ్‌ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హోం ఓటింగ్‌ తొలి దశలో వినియోగించిన బ్యాలెట్‌ బాక్సులతో కాకుండా బుధవారం చిన్న సైజులో ఉన్న కొత్త వాటిని సెక్టార్‌ టీంలకు అందించారు. దీంతో పలుచోట్ల రాజకీయ పార్టీల ఏజెంట్‌లు అభ్యంతరం పెట్టారు. అయితే అధికారులు మాత్రం అవన్ని స్ట్రాంగ్‌రూంలో భద్రంగా ఉన్నాయని చెప్పి సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కాగా హోం ఓటింగ్‌ బ్యాలెట్‌ బాక్సుల సీళ్లు పగలగొట్టి వాటిని ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం వినియోగించారన్న అనుమానాలను పలువురు వ్యక్తపరిచారు. దీని వలన తొలి విడతలో జరిగిన హోం ఓటింగ్‌ ఓట్లు భద్రంగా, ఉన్నాయో లేవోనని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూం సీలు తెరిచి తమకు చూపించాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 07:29 AM