Share News

ఎర్రకుంటపై మరలా కబ్జాదారుల కన్ను

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:23 PM

కారంపూడి-వినుకొండ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్‌ బంకు పక్కన దశాబ్దాల కాలంగా ఎర్రకుంట భూమి ఉంది.

ఎర్రకుంటపై మరలా కబ్జాదారుల కన్ను
ఎర్రకుంట భూమిని పూడ్చడానికి తోలిన మట్టి కుప్పలు

కారంపూడి, జూలై 26: కారంపూడి-వినుకొండ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్‌ బంకు పక్కన దశాబ్దాల కాలంగా ఎర్రకుంట భూమి ఉంది. ఈ కుంటలో పశువులు, మేకలు, ఆవులు దాహార్తిని తీర్చుకుంటాయి. వేసవి కాలంలో సైతం ఈ కుంట నీరు అన్ని జీవాలకు తాగునీటిని అందిస్తుంది. కారంపూడిలోని సర్వే నం.772/3లో 4.82 ఎకరాల కుంట భూమి ఉంది. ఈ భూమిపై గత జనవరిలో అప్పటి అధికారపార్టీ వైసీపీ నేతల కన్ను పడింది. కొద్దికొద్దిగా పూడ్చుకుంటూ మట్టితోలి చదును చేశారు. అప్పుడు పత్రికలన్నీ ఈ కబ్జాను వెలుగులోకి తేవడంతో తప్పని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. మరలా దీనిపై కబ్జాదారుల కన్ను పడింది. బోర్డును పీకిపారేసి కుంటను పూడ్చడానికి మట్టిని తోలిస్తున్నారు. రహదారి పక్కనే ఉన్న ఈ భూమికి మంచి గిరాకీ ఉంది. దీనిని కబ్జా చేసి సొంతం చేసుకోవాలనే ఆశ కబ్జాదారుల్లో మొదలైంది. దీనిలో కొంత భాగాన్ని సరిహద్దు పొలాల వారు కలిపేసుకున్నారు. ఈ ప్రాంతంలోనే పెట్రోల్‌ బంకు ఏర్పాటవడంతో భూమికి ధర పెరిగింది. రెవెన్యూ శాఖ దీనిపై మరలా దృష్టి సారించి కొలతలు వేసి భూమి చుట్టూ పెన్సింగ్‌ వేసి కుంటభూమి మనుగడను కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM