Share News

మరమ్మతులు జరిగేనా?

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:34 AM

సాగునీరు పారాల్సిన కాల్వలు.. తూటికాడ, జమ్ము, రబ్బరు మొక్కలతో నిండిపోయాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భూములకు సాగునీరు అందించాల్సిన కాల్వలు పూడికతో నిండిపోయాయి. సాగునీటి కాల్వల కట్టలు కోతకు గురై ఉన్నాయి. సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నా పాలకులకు పట్టలేదు. ఐదేళ్లు అటు వర్షాభావం.. ఇటు అరకొర ఉన్న సాగునీరు కాల్వల ద్వారా సక్రమంగా అందక రైతులు అల్లాడిపోయారు. అయినా పాలకులు కాల్వల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.. రైతుల గోడు ఆలకించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అయినా సాగునీటి కాల్వల బాగుపై దృష్టి సారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్‌కు సాగునీటి ఇబ్బందులు లేకుండా కనీసం తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేయాలని రైతులు కోరుతున్నారు.

మరమ్మతులు జరిగేనా?
తెనాలి వద్ద హైలెవల్‌ ఛానల్‌లో గుర్రపుడెక్క

నరసరావుపేట, తెనాలి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దెబ్బతినిపోయి గండ్లు పడటానికి సిద్ధంగా ఉన్న కాల్వ కట్టలు. కాల్వల్లో సాగునీరు కిందికి పోకుండా కమ్మేసిన గుర్రపుడెక్క. షట్టర్లకు రంధ్రాలు పడి, చెక్కలు అడ్డుపెట్టినా వృథాగా పోతున్న సాగునీరు. ఇదీ ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి కాల్వలు, డ్రెయిన్ల దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు చివరి భూములకు చేరడం కష్టమే. నీటి విడుదల ఆలస్యమైనా, నీరు చివరి వరకు చేరకున్నా పంట దిగుబడులపై ప్రభావం చూపే పరిస్థితి. అయినా నాటి పాలకులు సాగునీటి వ్యవస్థ గురించి కనీసంగా కూడా ఆలోచించలేదంటే ఆశ్చర్యం కాదు. డెల్టా పరిధిలో గత నాలుగు సీజన్లలో ఒక్క పనికూడా జరిగిన దాఖలాలే లేవు. దీంతో సాగునీటి కష్టాలు మరింత పెరిగిపోయాయి. చుక్కనీరు చివరి భూమి వరకు వెళ్లాలంటే ఒక ప్రహసనమే. కేవలం చిల్లర విధిలింపులతో అప్పటి వైసీపీ సర్కారు సరిపెట్టింది. దీంతో ఒక్క గండీ పూడ్చలేని పరిస్థితి. కాల్వ కట్టలు దెబ్బతినిపోయినా, గండ్లు పడినా, చివరి భూములకు నీరు అందకపోయినా అడిగే దిక్కేలేదు. అప్పట్లో ఓఅండ్‌ఎం నిధులే దిక్కు. అవికూడా ప్రతిపాదనలు పంపినంత కాకుండా వారికి తోచినంత ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. సాగునీరు చివరి భూముల వరకు అందాలంటే కాల్వలే కీలకం. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ కాల్వలు గత నాలుగేళ్లుగా అధ్వానంగా మారిపోయాయి. పట్టించుకునే దిక్కులేక, దెబ్బతిన్న కట్టలను బాగుచేసేవారులేక, షట్టర్లు తుప్పు పట్టిపోయిన పరిస్థితి. ఇక కాల్వల్లో నీరు ప్రవహించడానికి దారిలేదన్నట్టు పిచ్చిచెట్లు, ముళ్ల కంపలు, తూటుకాడ, గుర్రపు డెక్క పెరిగిపోయి అడ్డుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు పడుతున్నాయి. జలాశయాలకు పుష్కలంగా నీరు వస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగునీటి కాల్వల మరమ్మతుల విషయంలో దేనినీ ఆలస్యం చేయడానికి వీలులేదు. మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేసేందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లుగా సాగర్‌ పరిధిలోని కాల్వల్లో పూడిక తీత నోచుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించగా.. పనులు నిర్వహణ ప్రతిపాదనలకే పరిమితమైంది. నిధుల విడుదలపై నేటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాదికి కాలువలకు మరమ్మతులు లేనట్లేనన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. కాలువలు బాగు చేయకపోతే సాగునీటి పారుదలకు ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం ఇటీవల రూ.13.62 కోట్లు మంజూరు చేసింది. అయితే అటు పట్టిసీమ నీరు, ఇటు వర్షాలతో ప్రస్తుతం కాల్వల్లో నీరు పుష్కలంగా పారుదల అవుతుంది. దీంతో కాల్వల మరమ్మతులకు ఇబ్బందులు తప్పడంలేదు. కాల్వలకు సకాలంలో నీరొచ్చిందన్న ఆనందం కాల్వల ఎగువ భూముల రైతులకుంటే, చివరి భూముల రైతులు మాత్రం నీరు అందని పరిస్థితుల్లో మరమ్మతులు జరిగితే బాగుంటుందని ఎదురు చూస్తున్న పరిస్థితి.

డెల్టాలో పనులపై సందిగ్ధత

కృష్ణా పశ్చిమ డెల్టాలో అత్యవసర మరమ్మతుల కోసం ఈ సీజన్‌కు ప్రభుత్వం రూ.13.62 కోట్లు మంజూరు చేసింది. వీటితో డెల్టా కాల్వలు, డ్రెయిన్లలో అత్యవసరమనుకున్న 188 పనులు పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ సన్నద్ధమయింది. కృష్ణా పశ్చిమ విభాగం పరిధిలో 85 పనుల కోసం రూ.4.98 కోట్లు, రేపల్లె, చీరాల డ్రెయినేజి డివిజన్‌ల పరిధిలో 98 పనులకు రూ.7.3 కోట్లు, గుంటూరు వాహిని కింద 5 పనుల కోసం రూ.1.31 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే కాల్వలకు నీరొచ్చేయటం, డెల్టాలో వరి సాగు వెద పద్ధతిలో మొదలవడంతో పనులు ఆచరణలో ఎంతవరకు సకాలంలో పూర్తవుతాయనేదే సందేహంగా మారింది. నీటిపారుదల శాఖ అధికారులు పనులను చిన్నవిగా విభజించి, స్వల్పకాలిక టెండర్లను పిలిచింది. అయితే కాంట్రాక్టర్ల మధ్య ఒప్పందం పూర్తై, వారు పనులు మొదలుపెట్టడానికి ఇంకా పక్షం రోజులు పట్టే పరిస్థితి. ఈ తరుణంలో పనులు సాగేతీరుపై సందిగ్ధత నెలకొంది.

గతంలో పనులు చేయకుండానే దోచేశారు

ఖరీఫ్‌ సీజన్‌ వస్తుందంటే మూడు నెలల ముందు నుంచి డెల్టా కాల్వల మరమ్మతులు, అత్యవసర మరమ్మతులు పూర్తిచేసే పనిలో నీటిపారుదల శాఖ తలమునకలై ఉండేది. కానీ గత నాలుగు సీజన్లలో ఒక్కపని కూడా లేదు. ప్రభుత్వం రైతుల కోసం కేటాయిస్తానన్న నిధుల మాట అటుంచితే, అత్యవసర పనులు చెయ్యాల్సిన తరుణంలోనూ మొండిచెయి చూపుతూ వచ్చింది. గతంలో సాగునీటి కాల్వల మరమ్మతుల కోసం సాధారణ నిధులు, ప్రత్యేక మరమ్మతుల కోసం నిధులను ప్రభుత్వం విడుదల చేసేది. ఇవేకాక ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌(ఓఅండ్‌ఎం) కింద కూడా కొన్ని నిధులు మంజూరు చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవన్నీపోయి చివరకు ఓఅండ్‌ఎం నిధులే దిక్కయ్యాయి. అవికూడా విదిలింపులే ఉండటంతో పనులు జరిగిన పరిస్థితి లేదు. ఆ కొద్దిపాటి నిధులను కూడా కాల్వలు ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా, కాల్వలకు నీరు వదిలే సమయంలో విడుదల చేసి, హడావిడి చేసినట్లు చూపించి, చివరకు వాటిలో 80 శాతం నిధులు ఆ పార్టీ నేతలే కాంట్రాక్టర్‌లుగా అవతారమెత్తి దోచేసిన సందర్భాలున్నాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లోనూ రూ.22 కోట్లు ప్రభుత్వం ఓఅండ్‌ఎం కింద మంజూరు చేస్తే, వాటిలో తూటుకాడ తొలగింపు, పూడికతీత పేరుతో మొత్తం దోచేశారు.

రూ.22.54 కోట్ల ప్రతిపాదనలతో సరి

నాగార్జున సాగర్‌ కుడి కాల్వ పరిధిలో మేజర్లు, మైనర్లు, సబ్‌మైనర్‌ కాల్వలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. డ్రాపులు పగిలిపోయాయి. షట్టర్లు కూడా దెబ్బతిన్నాయి, చాలా మైనర్లకు నీటిని సరఫరా చేసే తూములకు కనీసం షట్టర్లు కూడా లేవు. దీంతో నీటి సరఫరాలో నియంత్రణ ఉండటంలేదు. సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరమ్మతులకు జలవనరుల శాఖ రూ.22.54 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. మరమ్మతులు తప్పనిసరి అయినా ప్రభుత్వం నిధులు విడుదల ఊసెత్తకపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ, లింగంగుంట్ల, సత్తెనపల్లి డివిజన్లలో అత్యవసర మరమ్మత్తులకు సంబంధించి 473 పనులను గుర్తించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ22.54 కోట్లు వ్యయం అంచనా వేశారు. ఈ పనులపై ఇటీవల మంత్రి నిమ్మల సమీక్షించినా నేటి వరకు నిధులు కేటాయింపులు లేవు.

Updated Date - Jul 27 , 2024 | 12:34 AM