Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అవస్థలు షరా మామూలే

ABN , Publish Date - May 09 , 2024 | 02:11 AM

ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌కు అనుసరించిన విధానం ఉద్యోగులు, ఉపాధ్యాయులను అవస్థల పాలు చేసింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అవస్థలు షరా మామూలే

ఉద్యోగులకు తప్పని తిప్పలు

తెనాలి అర్బన్‌, మే 8: ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌కు అనుసరించిన విధానం ఉద్యోగులు, ఉపాధ్యాయులను అవస్థల పాలు చేసింది. ఈ అవస్థలు గమనించిన ఎన్నికల సంఘం ఓటు ఉన్న నియోజకవర్గంలో ఫారం-12 ఇచ్చి 7, 8 తేదీల్లో ఓటు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగులు అవస్థలు పడ్డారు. వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలలో ఓటు ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెనాలి నియోజకవర్గంలో పని చేస్తుంటే ఇక్కడ దరఖాస్తు ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడకు ఓటు రాలేదని, అక్కడకు వెళ్లాలని చెప్పడంతో మళ్లీ ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లి వచ్చారు. మీ ఓట్లు మేము మీరు పనిచేస్తున్న నియోజకవర్గానికి పంపామంటూ మళ్లీ ఇక్కడ ఓటు ఇచ్చే అవకాశం లేదంటూ తిప్పి పంపడంతో కాళ్లు ఈడ్చుకుంటూ మండుటెండలో తెనాలి వచ్చారు. అదే విధంగా తెనాలి నియోజకవర్గంలో ఓటు ఉండి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో, వివిధ జిల్లాల్లో పని చేసేవారు కూడా ఈవే అవస్థలు ఎదుర్కొన్నారు. హౌసింగ్‌ ఏఈ శ్రీనివాస్‌ తెనాలిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో ఓటు ఉంది. ఆయన తెనాలి నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు చేశారు. కాకినాడ నుంచి ఇక్కడకు ఓటు రాలేదు అక్కడకు వెళ్లి ఓటు వేయాలంటూ సిబ్బంది సెలవిచ్చారు. ఆయన కాకినాడ వెళ్లినప్పటికీ మీ ఓటు మేము తెనాలి పంపాం అక్కడే వేయాలని ఇక్కడ మరోమారు ఇచ్చే అవకాశం లేదంటూ చెప్పారు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోక ఓటు వదిలి వేసుకున్నారు. మున్సిపల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న స్వామి అనే ఉపాధ్యాయునికి రేపల్లెలో ఓటు ఉంది. తెనాలిలో ఆయన ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండవ శిక్షణలో ప్రత్తిపాడులో ఓటు వేయాలని చెప్పారు. కానీ అక్కడ ఓటు ఇవ్వలేదు. రేపల్లె వెళ్లిన అక్కడ కూడా చుక్కెదురైంది. మూడు చోట్లకు తిరిగి విసిగిపోయిన ఆయన సబ్‌ కలెక్టర్‌ను సంప్రదించి విచారణ చేయాలని కోరారు. మరో ఉపాధ్యాయుడు కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌ వినుకొండలో పనిచేస్తూ తెనాలిలో ఉన్న ఓటు కోసం దరఖాస్తు చేశాడు. ఆయన రెండు పట్టణాల మధ్య తిరిగిన ఫలితం కానరాలేదు. ఎన్నికల కమిషన్‌ స్విప్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసి ఓటు వేయాలనే ప్రతి ఒక్కరికి చెప్పిన దానికి విలువ ఏముందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న వారికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. మరో మహిళ వేరే నియోజకవర్గంలో ఉన్న ఓటు తెనాలికి వచ్చిందని నాలుగు గంటల పాటు క్యూ లైన్లలో నిలబడి తీరా పోలింగ్‌ బూత్‌లోకి వెళితే ఓటు రాలేదని చెప్పడంతో హతాశురాలైంది. వీరంతా పోస్టల్‌ ఓటింగ్‌ బూత్‌ల పర్యవేక్షణకు వచ్చిన సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల అధికారి ప్రఖర్‌జైన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలు పర్యవేక్షిస్తున్న కొల్లిపర తహసీల్దార్‌ శ్రీనివాసులుతో మాట్లాడి ఆర్టీసీ డ్రైవర్ల నుంచి డిక్లరేషన్‌ తీసుకుని ఓటు వేయించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన బ్యాలెట్లను విచారించాలని వారి చేత ఓటు వేయించాలని ఆదేశించారు.

తెనాలిలో 2360 పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

తెనాలి అర్బన్‌, మే 8: తెనాలి మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలో 2360 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఇక్కడ పని చేస్తున్న వారితో పాటు వివిధ నియోజకవర్గాల్లో ఓటు ఉన్న వారంతా ఇక్కడ ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో ఓటు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిగిన మూడు రోజుల్లో ఓటు కలిగిన ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, అత్యవసర సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చిన రెండు రోజుల్లో కూడా ఇంకా కొంత మంది మిగిలిపోయారు. వీరికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి రెండోసారి ఫారం-12 తప్పనిసరిగా ఓటున్న నియోజకవర్గంలో తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - May 09 , 2024 | 07:22 AM