CM Chandrababu: గొప్ప మానవతావాదిని కోల్పోయాం..
ABN , Publish Date - Oct 10 , 2024 | 07:21 AM
కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణం లోనూ, పరోపకారి గుణంలోనూ తరతారాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు. ఆయన గొప్ప వారసత్వాన్ని మనకు వదిలి వెళ్ళారని, టాటా గ్రూప్‌కు, ఆయనను ప్రేమించేవారికి బాధా తప్త హృదయంతో సంతాపం తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
కాగా రతన్ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ, విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కారు ద్వారా రతన్ టాటా లక్ష రూపాయలకే మిడిల్ క్లాసుకు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా, టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చి దిద్దారు. బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కొనుగోలు రతన్ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు, బ్రిటిష్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి, టాటా స్టీల్ కంపెనీ కార్యకలాపాలను యూర్‌పకూ విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు.
సైరస్ మిస్త్రీతో వైరం
తన తర్వాత టాటా గ్రూప్‌ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కాని వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుది బండలా మారిన ‘నానో’ కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్ టాటా అడుగడుగునా అడ్డుతగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్ పట్టుబట్టడం వల్లే, మిస్త్రీ టాటా గ్రూప్‌కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం వెనక రతన్‌టాటా మద్దతు ఉంది.
50కి పైగా స్టార్ట్‌పల్లో పెట్టుబడులు
రతన్ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్ సహా 50కి పైగా స్టార్ట్‌పల్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే!
ఎయిరిండియా కొనుగోలు
టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తేవాలన్నది రతన్ టాటా చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేషియా ఎయిర్‌లైన్స్‌తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ పట్టులోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇపుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది