Share News

High Court : చట్టనిబంధనల మేరకు నడుచుకోండి

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:06 AM

వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేత వ్యవహారంలో చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

High Court : చట్టనిబంధనల మేరకు నడుచుకోండి

  • వైసీపీ కార్యాలయాల వ్యవహారంపై అధికారులకు హైకోర్టు ఆదేశం

  • 2 వారాల్లో అధికారులకు వివరణ ఇవ్వండి.. పిటిషనర్లకు కోర్టు సూచన

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేత వ్యవహారంలో చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది.

తమ వాదనలకు బలం చేకూర్చే దస్త్రాలను, ఆధారాలు, అదనపు వివరణలను రెండు వారాల్లో అధికారుల ముందు ఉంచాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. అనంతరం ప్రతీ భవనానికి సంబంధించి పిటిషనర్లు సమర్పించిన వివరణలను పరిశీలించి, విచారణ జరపాలని పేర్కొంది. చట్టనిబంధనల్లో పేర్కొన్న విధంగా అవసరమైన ప్రతీ దశలోనూ పిటిషనర్లు తమ వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేసింది.

విచారణ పెండింగ్‌లో ఉండగా భవనాల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. నిర్మాణాలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా, స్థానికులకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే కూల్చివేత ప్రక్రియ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉంటే తప్ప కూల్చివేత అధికారాన్ని వినియోగించవద్దంది. వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం తీర్పు ఇచ్చారు.

Updated Date - Jul 05 , 2024 | 05:06 AM