Share News

రేషన్‌, ఇసుక మాఫియాపై ‘పిడి’కిలి

ABN , Publish Date - Nov 22 , 2024 | 03:42 AM

రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది.

రేషన్‌, ఇసుక మాఫియాపై ‘పిడి’కిలి

  • భూ ఆక్రమణల సవరణ బిల్లులో కఠిన నిబంధనలు

  • కబ్జాలకు ప్రయత్నిస్తే 14 ఏళ్లు జైలే!

  • జ్యుడీషియల్‌ ప్రివ్యూ రద్దు సహా పలు బిల్లులకు ఓకే

  • చట్టసభల్లో బీసీలకు 33% కోటా తీర్మానం

  • భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు

అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత పీడీ యాక్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టగా.. ఆంధ్రప్రదేశ్‌ భూ ఆక్రమణ (నిషేధిత) సవరణ బిల్లు-2024ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సభ ముందుంచారు. పట్టణాలు/నగరాల్లో గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పురపాలక చట్టం (రెండో సవరణ) బిల్లు-2024ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఏపీ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు-2024, ఏపీ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు-2024లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్‌ సవరణ బిల్లు -2024ను దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా ముందస్తు న్యాయ సమీక్ష (జ్యుడీషియల్‌ ప్రివ్యూ) రద్దు బిల్లు-2024ను రాష్ట్ర మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఆయా బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.


  • 5 నెలల్లోనే క్రైం రేటు తగ్గింది: హోంమంత్రి అనిత

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రంలో నేరాల రేటు 18 శాతం తగ్గిందని హోం మంత్రి అనిత తెలిపారు. నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టే విధంగా పీడీ యాక్టులో సవరణలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు బందిపోట్ల మాదిరిగా పేదలను బెదిరించి వారి భూములను కబ్జా చేసేశారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. వీటిపై 79,907 ఫిర్యాదులు రాగా.. వాటిలో 8,970 భూ ఆక్రమణలకు సంబంధించినవేనని తెలిపారు. భూ ఆక్రమణలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి 10 నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు ప్రతిపాదించామన్నారు. ఇక, లోన్‌ యాప్‌లో రుణం తీసుకుంటే వారికి చావే శరణ్యమని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో ప్రజల్ని మానసికంగా ఏడిపిస్తూ చావులకు కారణం అవుతున్న 199 మందిని ఇటీవలి కాలంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

  • బీసీలకు 33% రిజర్వేషన్‌ కోసం పోరు: బాబు

చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ బీసీ సంక్షేమ మంత్రి ఎస్‌.సవిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేవరకు టీడీపీ పోరాడుతుందని చెప్పారు.

Updated Date - Nov 22 , 2024 | 03:42 AM