నచ్చితే కోరినంత మేత!
ABN , Publish Date - Nov 20 , 2024 | 02:51 AM
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్‌రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
ఐదేళ్లూ న్యాయ శాఖలో జగన్ ‘లా’
అడ్వకేట్లతోనూ క్విడ్ ప్రో కో సేవలు
ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు
చెల్లింపులకు అడ్డగోలు జీవోలు
సీఎం కాకముందే జగన్‌పై కేసులు
వాటిని వాదించేవారికే కీలక పోస్టులు
జగన్ జమానాలో వారికి రాజపోషణ
తాజాగా వెలుగులోకి మరో ఉదంతం
అప్పటి జీవో రద్దు చేసిన న్యాయ శాఖ
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చట్టాలు, ప్రజాస్వామ్యం గురించి బోధనలు చేస్తున్న జగన్ తన జమానాలో మాత్రం వాటిని కాలరాశారు. చివరికి లాయర్ల సేవల్లోనూ క్విడ్‌ప్రోకోను వాడిన ఘనత జగన్‌దే. కోర్టుల్లోనూ తన మాటే నెగ్గాలని అనుంగు న్యాయవాదులను తెచ్చిపెట్టుకున్నారు. వారికి రాజపోషణ అందించారు. తన మాటే శాసనం అన్నట్టు.. ఎవరి అనుమతి, ఆమోదం అక్కరలేదనుకొని ప్రజాధనాన్ని పణంగాపెట్టి వారికి భారీగా సమర్పించుకున్నారు. అయితే, ఎంత చెల్లించారు? ఏ తరహా కానుకలు సమర్పించారనేది ఇప్పటిదాకా బయటికి తెలియదు. అయితే, ఇటీవల ఓ న్యాయవాది కేసును పరిశీలించినప్పుడు ఆయన విషయంలో రాజపోషణ, నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో సాగిందో బయటపడింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్‌రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. వారు కోర్టుల్లో ఓ వైపు జగన్ కేసులు, మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార, ఇతర కేసులను వాదించారు. తన కేసులు వాదించినందుకు జగన్ వారికి ఎంత మేరకు ఫీజులు చెల్లించారు? కానుకలు ఏమిచ్చారు? అన్నవి బయటికి తెలియదు. కానీ, ప్రభుత్వంపై నమోదయిన కోర్టుధిక్కార కేసులపై హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, ప్రభుత్వ ప్లీడర్ (జీపీ) హోదాలో వాదనలు వినిపించినందుకు మాత్రం కళ్లుచెదిరే చెల్లింపులు చేశారు. అంతకు ముందు నుంచి అమల్లో ఉన్న నియమనిబంధనలు, మార్గదర్శకాలను జగన్ తనదైన శైలిలో తొక్కిపెట్టి, తాను ఏది చెబితే అదే రూల్, ఏది చేస్తే అదే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రిగా తనొక్కడే నిర్ణయం తీసుకుంటే చాలు, ఆర్థిక, ఇతర శాఖల ఆమోదం, న్యాయబద్ధమైన పరిశీలనలతో పనిలేదన్నట్లుగా న్యాయవాదులకు ఫీజులు చెల్లించారు. నిజానికి ఒక పీపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున కేసులో హాజరయి వాదనలు వినిపించినా, లేదా కనీసం కనిపించినా రూ.5వేలు చెల్లించాలన్నది నిబంధన. జగన్ దీన్ని తిరగరాశారు. తనకు నచ్చినట్లుగా ఫీజులు చెల్లింపులకు జీవోలు ఇచ్చేశారు. చింతల సుమన్.. ఇందుకు ఓ ఉదాహరణ!
జగన్ చెబితే శాసనమే..
చింతల సుమన్‌ను ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా 2021 సెప్టెంబరు 30న జగన్ ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో పురపాలక శాఖపై 132 దాకా ధిక్కార కేసులు నమోదయ్యాయి. శాఖ తరపున ఆ కేసుల విచారణలో స్పెషల్ జీపీగా సుమన్ హాజరవ్వాలి. ఇందుకు ఆయనకు ఒక్కో సిట్టింగ్‌కు నిబంధనల ప్రకారం రూ.5వేల చొప్పున ఇవ్వాలి. ఇందుకు ఆయన ఫీజుకయ్యే మొత్తం రూ.6,60,000. కానీ ఇది జగన్‌కు నచ్చలేదు. ఒక్కో సిట్టింగ్‌కు రూ. 44వేలు ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు. 132 కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు ఏకంగా రూ.58,08,000 ఫీజు చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 16న పురపాలక శాఖ పరిపాలన అనుమతి ఇస్తూ జీవో 208 ఇచ్చింది. ఆ తర్వాత 23న బిల్లు చెల్లింపునకు ఆమోదం తెలుపుతూ, న్యాయశాఖ జీవో 91 జారీ చేసింది. ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్దిరోజుల ముందు సాగిన పరంపర. ఈ ఫీజుల ప్రతిపాదన 2021లో న్యాయశాఖ విడుదల చేసిన జీవో 279కు విరుద్ధంగా, ఆర్థికశాఖ ఆమోదం లేకుండా ముందుకు తీసుకొచ్చారు. స్పెషల్ జీపీలకు కేసు విచారణలో హైకోర్టుకు హాజరయినందుకు ఎంత ఫీజు ఇవ్వాలో జీవో 279 చెబుతోంది. దీనికి ఆర్ధికశాఖ ఆమోదం ఉంది.
కానీ జగన్ నిర్ణయంతో వెలువడిన జీవో 208కి ఆర్థికశాఖ ఆమోదం లేనేలేదు. నిజానికి ఆ జీవోను ఆర్ధికశాఖ ఆమోదానికి పంపించాలి. కానీ సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల చెల్లింపునకు జీవోలు ఇచ్చినా ఆర్థికశాఖ వాటిని ప్రాసెస్ చేయలేదు. దానిపై కొన్ని ఒత్తిళ్లు వచ్చినా అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అదికాస్తా ఆగిపోయింది.
జీవో రద్దు...
కూటమి ప్రభుత్వం వచ్చాక బిల్లుల చెల్లింపు ప్రతిపాదనను పరిశీలించగా, దానికి సంబంధించిన జీవోకు తమ ఆమోదం లేదని ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. ఎవరి ఆమోదంతో ఈ జీవోలు ఇచ్చారో ఆరాతీసింది. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకొని జీవోలు ఇచ్చారని నిర్ధారించుకున్నారు. ఈ నేపధ్యంలో జీవో 208, దాని ఆధారంగా న్యాయశాఖ ఇచ్చిన జీవో 91ని రద్దుచేస్తూ తాజాగా న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఉత్తర్వులు (జీవో. 415) జారీ చేశారు. ఇదిలాఉండగా, ఇలాంటి ఖారీ చెల్లింపులు చాలానే జరిగాయన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం వీటిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.