Share News

Jagan: అవును.. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టాడు!

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:12 AM

‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్‌ పోలింగ్‌ బూత్‌లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.

Jagan: అవును.. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టాడు!

  • పోలింగ్‌ బూత్‌లో అన్యాయం జరుగుతోందని చెప్పడానికే: జగన్‌

  • మంచోడు కాబట్టే 4 సార్లు గెలిచాడు

  • అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు

  • రెడ్‌బుక్స్‌తో అన్యాయంగాప్రవర్తిస్తున్నారు

  • రేపు మీ వాళ్లకూ అదే జరుగుతుంది

  • చంద్రబాబుకు మాజీ సీఎం హెచ్చరిక

  • నెల్లూరు జైలులో పిన్నెల్లితో ములాఖత్‌

  • ఐదేళ్ల తర్వాత మీడియా ముందుకు

నెల్లూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్‌ పోలింగ్‌ బూత్‌లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు. నిజంగానే రామకృష్ణారెడ్డి కనుక రిగ్గింగ్‌ చేసుకుంటా ఉంటే.. నిజంగా అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి బాగానే ఉండిఉంటే ఎందుకు ఈవీఎం బద్దలు కొడతాడు’ అని మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈవీఎం కేసులో ఆయనకు బెయిల్‌ వచ్చిందని..

అయితే ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత రామకృష్ణారెడ్డి ఆ బూత్‌లో హత్యాయత్నం చేసినట్లు కేసు నమోదు చేశారని.. నిజంగానే అటువంటిది జరిగి ఉంటే సిట్‌ తన రిపోర్టులో చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు. పిన్నెల్లి మంచోడు కాబట్టే వరుసగా 4సార్లు గెలిచారన్నారు. అటువంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టారని ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్‌ గురువారం ములాఖత్‌లో కలిశారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు చేరుకున్న ఆయన.. మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, అంబటి రాంబాబులతో కలిసి జైలుకు వెళ్లారు. పిన్నెల్లితో 20 నిమిషాలు మాట్లాడారు.

అనంతరం జగన్‌ జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. కారంపూడిలో మే 14న ఓ ఎస్సీ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు పిన్నెల్లి బయల్దేరితే ఊరిబయటే అడ్డగించారని, హత్యాయత్నం కేసు పెట్టిన సీఐ నారాయణస్వామి అసలు పిన్నెల్లికి తారసపడలేదని చెప్పారు. ఆ సమయంలో కారంపూడి టౌన్‌లో గొడవ జరుగుతోందని, అక్కడ రెండు వర్గాలు రాళ్లు విసురుకున్న ఘటనలో సీఐకి చిన్న రాయి ఏదో తగిలి ఉండవచ్చని అన్నారు. కానీ ఆ రోజు సీఐ మెడికో లీగల్‌ కేసు పెట్టలేదని, మే 23న హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు.


ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్‌ ఈ ఘటనను కూడా తన రిపోర్టులో పేర్కొనలేదన్నారు. ‘వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. మంచి చేసి ఓడిపోయాం. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఓడిపోయాం’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌, ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు రెడ్‌బుక్స్‌ పెట్టుకుని అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ‘ఎల్లకాలం రోజులు ఒకేలా ఉండవు. చంద్రబాబును ప్రజలు క్షమించరాని పరిస్థితులు వస్తాయి. మీరు వేసే విత్తనమే రేపటి రోజున పండుతుంది.

రేపటి రోజు గ్రామాల్లో మీ నాయకులకు ఇదే జరుగుతుంది. చంద్రబాబును హెచ్చరిస్తున్నా..’ అని అన్నారు. కాగా.. జగన్‌ మీడియా ముందుకురావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అయితే ఆయన చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు. ఆయన వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా జైలు వద్దకు వచ్చారు.

ఆధార్‌ ఇవ్వడానికి జగన్‌ నో?

వాస్తవానికి పిన్నెల్లితో జగన్‌ ములాఖత్‌పై ఉదయం కాసేపు సస్పెన్స్‌ నెలకొంది. జైలు మాన్యువల్‌ ప్రకారం ములాఖత్‌ అయ్యే వ్యక్తి తన ఆధార్‌ కార్డును సమర్పించాలి. అయితే జగన్‌ ఆధార్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని, సాధారణ ములాఖత్‌ కాకుండా ప్రత్యేక గదిలో ఏర్పాటు చేయాలని షరతు పెట్టినట్లు ప్రచారం జరిగింది. జైలు అధికారులు అంగీకరించకపోవడంతో చివరకు ఆధార్‌ సమర్పించినట్లు తెలిసింది. అలానే ప్రత్యేక గదిలో కాకుండా అందరిలాగే ములాఖత్‌కు అధికారులు అనుమతులిచ్చారు.

Updated Date - Jul 05 , 2024 | 07:53 AM