Share News

Ap School Students: రూ.పది ఇవ్వరు.. ఫైవ్‌స్టార్‌ భోజనమట!

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:30 AM

మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్‌ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు.

Ap School Students: రూ.పది ఇవ్వరు..  ఫైవ్‌స్టార్‌  భోజనమట!

  • మధ్యాహ్న భోజనంపై వైసీపీ కలరింగ్‌

  • వంటచేసే వారికి స్టార్‌ హోటల్‌

  • చెఫ్‌ల వీడియోలు

  • అవి చూడగానే స్టార్‌ రుచులు వస్తాయట

  • ఆ హోటళ్లలో భోజనం ఖరీదు వేలల్లో

  • విద్యార్థులకు ఇచ్చేది రూ.8.57, రూ.5.88లే

  • ఈ మొత్తం పెంచాలని ఎండీఎం కార్మికుల గగ్గోలు

  • రేట్లు పెంచకుండా స్టార్‌ హోటల్‌ కబుర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్‌ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండే వంట కార్మికులకు ఈ మేరకు చెల్లిస్తున్నారు. దాంతోనే రోజూ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

ఇంత తక్కువ మొత్తంతో భోజనం పెడితే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఇందులో బియ్యం, గుడ్లు మినహా అన్నీ వంట కార్మికులే సమకూర్చుకోవాలి. భోజనానికి ఇది సరిపోవడం లేదని ఇచ్చే మొత్తం పెంచాలని కార్మికులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గ్యాస్‌ సిలిండర్లపై అయినా రాయితీ ఇప్పించాలని కోరినా పట్టించుకోలేదు.

కూరగాయలు, వంటనూనె, ఇతరత్రా వంట సరుకుల రేట్లు పెరిగాయని, ఈ రేటుకు భోజనం చేయడం సాధ్యం కావట్లేదని కార్మికులు కోరుతున్నారు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు స్టార్‌ హోటల్‌ రుచులు అంటూ హడావిడి చేస్తోంది. అంతే తప్ప భోజనానికి ఎంత పెంచుతారు అనే విషయంపై స్పందించడం లేదు.

  • ఇంటి నుంచే భోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో 36లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తినడం లేదని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. కానీ 25లక్షల మంది కూడా ప్రభుత్వం పెడుతోన్న భోజనం చేయట్లేదు. చాలా మంది విద్యార్థులు ఇంటినుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. అయితే గుడ్డు లాంటివి విద్యార్థులు తీసుకుంటే మొత్తం భోజనం చేసినట్లుగా అధికారులు లెక్కలేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు సహకారంతో ఇచ్చే రాగి జావ కార్యక్రమం కూడా అస్తవ్యస్తంగా మారింది. చాలాచోట్ల నిల్వ పిండి కారణంగా రుచించక జావ తాగేందుకు పిల్లలు ఇష్టపడట్లేదు. భోజనం నాసిరకంగా ఉండటంతో కేవలం గుడ్లు, చిక్కీలు తప్ప విద్యార్థులు మిగిలిన భోజనం తినేందుకు ఆసక్తి చూపట్లేదు.

  • చిక్కీల్లోనూ కమీషన్లు

ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు కొత్తగా చిక్కీలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే చిక్కీల పంపిణీ కాంట్రాక్టర్లపై వైసీపీ నాయకులు, కొందరు మంత్రులు మితిమీరిన ప్రేమ చూపిస్తున్నారు. 2022తో ముగిసిన చిక్కీ సరఫరా కాంట్రాక్టును ఎలాంటి టెండరు లేకుండా పొడిగించారు. దాంతో అడ్డగోలుగా వ్యవహరించిన చిక్కీల కాంట్రాక్టర్లు కాలం చెల్లిన(తేదీ ముగిసిన) చిక్కీలను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఇది తనిఖీల్లో బయటపడినా కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలూ లేవంటే ప్రభుత్వ పెద్దలకు ఏ స్థాయిలో కమీషన్లు అందుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. ఇలా ప్రతి దాంట్లో కమీషన్లకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ పెద్దలు భోజనం పథకాన్ని అస్తవ్యస్తం చేశారు.

గతంలో ప్రతిరోజూ ఎంత మంది విద్యార్థులు బడుల్లో తింటున్నారనే లెక్కలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా, కొంతకాలంగా వాటిని తొలగించారు. అవి అందుబాటులో ఉంటే అసలు లెక్కలు బయటికొస్తాయని, పిల్లలు భోజనం తినట్లేదనే విషయం బయటపడుతుందని తొలగించేశారు!

ఫైస్టార్‌ హోటల్‌లో భోజనం ఖరీదు రూ.వెయ్యి పైనే! త్రీస్టార్‌ హోటల్‌లో అయినా దాదాపుగా అంతే ఉంటుంది!! బయట మెస్‌లో భోజనం చేసినా రూ.వంద పెట్టాల్సిందే.. కానీ పట్టుమని పది రూపాయలు ఇవ్వకుండా.. పాఠశాలల్లో విద్యార్థులకు ఫైవ్‌స్టార్‌ రుచులతో భోజనం పెడతామంటూ వైసీపీ ప్రభుత్వం కలరింగ్‌ ఇస్తోంది. మధ్యాహ్న భోజనం పథకంలో ఇకపై స్టార్‌ హోటల్‌ రుచులు అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టింది.

ఓ ప్రైవేటు స్టార్‌ హోటల్‌ చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండుతున్న వంట కార్మికులకు తాజాగా అవగాహన కల్పించినట్లు ప్రకటించింది. తీరా చూస్తే కేవలం ఆ చెఫ్‌లతో వీడియోలు చేయుంచి, వాటిని ఆ కార్మికులకు చూపించి.. అదే అవగాహన కార్యక్రమం అని పాఠశాల విద్యాశాఖ చెప్పడం కొసమెరుపు! పైగా దీనికోసం తిరుపతిలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించింది. ఇక, జగన్‌ సొంత మీడియాలో ఇకపై తాజ్‌ రుచులంటూ ఊదరగొట్టింది. కానీ ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఎంత ఇస్తున్నారనే విషయాన్ని మాత్రం దాచిపెట్టింది!

Updated Date - Jun 02 , 2024 | 08:08 AM