YSRCP : జాబితాపై జగన్‌కు ‘జంకు’.. అసలు సంగతి ఇదీ..!
ABN , Publish Date - Jan 02 , 2024 | 03:23 AM
సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భయపడుతున్నారా?
జగన్‌కు తిరుగుబాట్ల భయం!
అందుకే అభ్యర్థులపై పునరాలోచన!!
టీడీపీ-జనసేన ప్రకటించాకే విడుదల చేయాలని యోచన?
అవనిగడ్డకు మోపిదేవి!
రేపల్లె ఇన్‌చార్జిగా తప్పించినందుకు వైసీపీ కేడర్ నుంచి తీవ్ర నిరసనలు
కల్యాణదుర్గానికి ఎంపీ రంగయ్య!
గోదావరి, ఉత్తరాంధ్రలో చాలా మంది సిటింగ్‌లకు ఉద్వాసన?
రాయలసీమలోనూ ఇంతే
టికెట్లు దక్కనివారు షర్మిల రాకతో కాంగ్రె్‌సలోకి వెళ్లే అవకాశం
అందుకే జాబితా ప్రకటించకుండా జగన్ వెనకడుగు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌చార్జుల మలి జాబితాను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భయపడుతున్నారా? ఏకంగా 50 మందికిపైగా సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే జంకుతున్నారా అనే సందేహాలు వైసీపీ శ్రేణులను తొలిచేస్తున్నాయి. తొలి విడతలో 11 మంది ఇన్‌చార్జులను మార్చినప్పుడే పెద్దఎత్తున తిరుగుబాటు వచ్చింది. జగన్‌పై భయంతో సదరు ఎమ్మెల్యేలు నోరెత్తకున్నా.. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈ మార్పులను అంగీకరించడం లేదు. మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మార్చడాన్ని కేడర్ ప్రశ్నిస్తోంది. విశాఖ నగరంలోని గాజువాకలో తనను తప్పించడాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తొలి జాబితాపై పెద్దగా నిరసనలు లేవని భావించిన జగన్.. మలి జాబితాను ఈ నెల 2 లేదా 3న విడుదల చేయాలని అనుకున్నారు. సామాజిక పింఛన్‌ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతున్నందున.. బుధవారం నుంచి వారం పాటు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ముంగిట కొత్త ఇన్‌చార్జులతో ఈ పంపిణీ నడిపించాలని అనుకున్నారు. అసెంబ్లీ ఇన్‌చార్జులంతా ఇందులో పాల్గొనాలనీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మలివిడత జాబితాను జగన్ ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ జాబితాను శుక్రవారమే ప్రకటిస్తారని కూలి మీడియాకు లీకులిచ్చారు. ఈ చానళ్లు జిల్లాల వారీగా నియోజకవర్గ ఇన్‌చార్జుల పేర్లను ప్రసారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ నాయకత్వం విడుదలపై వెనుకంజ వేసింది. అసంతుష్టులను బుజ్జగించి మంగళ/బుధవారాల్లో అభ్యర్థుల జాబితా వెల్లడించాలనుకుంది. ఇది కూడా జరిగే అవకాశం తక్కువేనని వైసీపీ నేతలు అంటున్నారు.
అనుకున్న మార్పులు కొనసాగుతాయా?
రేపల్లె ఇన్‌చార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావును తప్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా వారు వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను శాంతింపజేయడానికి.. ఆయన్ను అవనిగడ్డకు వెళ్లాలని వైసీపీ అధిష్ఠానం కోరుతోంది. ఇంకోవైపు.. రెండో విడత జాబితాలో తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను.. అనంతపురం-ఏడుగురు, కృష్ణా-ఆరుగురు, ప్రకాశం- నలుగురు, విశాఖ- నలుగురు, పశ్చిమ గోదావరి-ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పారు. తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కల్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి, మడకశిరకు శుభకుమార్‌ను, పెనుగొండకు మంత్రి ఉషశ్రీ చరణ్, కదిరి-మక్బూల్, దర్శి-బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జగ్గంపేట-తోట నరసింహం, పిఠాపురం-ఎంపీ వంగా గీత, ఎమ్మిగనూరు-మాచిన వెంకటేశ్, శింగనమల-శ్రీనివాసమార్తి/శమంతకమణి/యామినీ బాల, యర్రగొండపాలెం-తాడిపర్తి చంద్రశేఖర్, ప్రత్తిపాడు-జానకీదేవి/వరుపుల సుబ్బారావు, గిద్దలూరు-శిద్దా రాఘవరావు లేదా సత్యనారాయణరెడ్డి లేదా వంశీధర్‌రెడ్డిలను ఇన్‌చార్జులను నియమిస్తారని చెబుతున్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్, మార్కాపురంలో నాగార్జునరెడ్డిని కొనసాగిస్తారని అంటున్నారు. ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావు పేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర నెల్లూరు, నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మార్పులూ చేర్పులూ ఉంటాయని తెలిసింది.
కనిపించని కొత్త సంవత్సర సందడి
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం పెద్దగా సందడి కనిపించలేదు. జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి మంత్రి జోగి రమేశ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రమే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. గతంలో ఇదే రోజు ఇక్కడ కిటకిటలాడేది.
షర్మిల భయం..?
అభ్యర్థులను మార్చితే సిటింగ్ ఎమ్మెల్యేల నుంచి నిరసన తీవ్రంగా ఉంటే అసలుకే ప్రమాదం ఉంటుందని కూడా జగన్ భయపడుతున్నట్లు తెలిసింది. వారు టీడీపీ, జనసేనల్లో చేరితే.. ఎన్నికలకు ముందే వైసీపీ ఎత్తిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందన్న ఆందోళనా ఉంది. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. ప్రభావం తీవ్రంగానే ఉంటుందని జగన్ భావిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పతనావస్థకు చేరింది. కాంగ్రెస్ నేతలు పలువురు జగన్ చెంతకు చేరారు. ఇప్పుడు షర్మిల వస్తే.. వైఎస్ అభిమానులంతా తిరిగి సొంతగూటికి చేరే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానంటూ ప్రకటించారు. మంగళగిరి అభివృద్ధికి జగన్ నిధులు ఇవ్వలేదని ఆళ్ల చేసిన వ్యాఖ్యలు వైసీపీని కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలతో మంగళగిరి టికెట్ వెనుకబడిన వర్గానికి ఇచ్చామని జబ్బలు చరచుకుంటున్న వైసీపీ పెద్దలకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. టికెట్ దక్కని సిటింగ్‌లు నిలదీస్తారని.. ఎమ్మెల్యేలకు జగన్ దర్శనమే ఇవ్వడం లేదు. ఇటీవల పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారఽథి, తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తమకు జగన్ దర్శనం ఇప్పించాలంటూ వైసీపీ పెద్దలను బహిరంగంగా కోరడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కొందరు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారికా అవకాశం దొరకడం లేదు.