Share News

MP Avinash Reddy ఎంపీ అవినాశరెడ్డికి సమస్యల వెల్లువ

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:47 PM

జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎంపీ అవినాశరెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పలువురు వైసీపీ నేతలు సమస్యలపై ఎంపీని నిలదీశారు.

 MP Avinash Reddy ఎంపీ అవినాశరెడ్డికి సమస్యల వెల్లువ
జమ్మలమడుగు ప్రజాదర్బార్‌లో ఎంపీ అవినాశరెడ్డికి సమస్యలు వివరిస్తున్న వైసీపీ నాయకులు

జమ్మలమడుగు, సెప్టెంబరు 17: జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎంపీ అవినాశరెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పలువురు వైసీపీ నేతలు సమస్యలపై ఎంపీని నిలదీశారు. ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వస్తున్నారని తెలిసి పలు గ్రామాల నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ.. మిమ్మల్ని నమ్ముకుని గ్రామాల్లో ఏజెంట్లుగా కూర్చున్నామని జమ్మలమడుగులో తమకు ఏమైనా జరిగితే దిక్కెవరని ప్రశ్నించారు. ధర్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, అతని అన్న కుమారుడు మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగితే ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని, ఇలా ఉంటే గ్రామాల్లో ఎలా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలోకి వచ్చి తనపైనే ఇలా మాట్లాడుతావా అంటూ మాజీ ఎమ్మెల్యే ఎదురు ప్రశ్న వేసినట్లు తెలిసింది. అనంతరం పి.బొమ్మేపల్లె, మైలవరం, పెద్దముడియం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వారి సమస్యలను ఎంపీకి వివరించారు. బొమ్మేపల్లె వద్ద జగనన్న కాలనీలో తలెత్తిన వివాదంపై బాధితులను తీసుకుని ఎంపీ ఆర్డీవో కార్యాలయాలనికి వెళ్లి ఆర్డీవో శ్రీనివాస్‌ను కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ గజ్జెల లక్షుమయ్య, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:47 PM