Share News

కాసులు కొట్టు.. విగ్రహాలు అమ్ముకో..!

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:18 PM

జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్‌ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్‌ కార్యాలయం సమీపాన, మార్కెట్‌ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.

కాసులు కొట్టు.. విగ్రహాలు అమ్ముకో..!
రామిరెడ్డిపల్లె దారిలో ఏర్పాటు వినాయక విగ్రహాలు

మున్సిపాలిటీ సిబ్బంది బెదిరింపులు ఫ ఇబ్బందుల్లో వినాయక విగ్రహాల వ్యాపారులు

జమ్మలమడుగు, సెప్టెంబరు 4: జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్‌ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్‌ కార్యాలయం సమీపాన, మార్కెట్‌ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బందిలో కొందరు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్‌ చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. అయితే వినాయక విగ్రహాలకు బెదిరించే వారికి డబ్బులు చెల్లిస్తే ఆ భారమంతా కొనుగోలుదారులపై పడుతుందని మరికొందరు వాపోతున్నారు. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం జమ్మలమడుగు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు రామిరెడ్డిపలె ్ల సర్కిల్‌ సమీపాన ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని, ఇవ్వకపోతేవిగ్రహాలను మున్సిపల్‌ కార్యాలయంలో తీసుకెళ్లి సీజ్‌ చేస్తామని బెదిరించినట్లుగా అక్కడున్న ఓ వ్యాపారి విలేకరులకు తెలిపారు. మూడు రోజులుగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారుల వద్దకు మున్సిపల్‌ అధికారులు తిరుగుతున్నట్లు తెలిపారు. వ్యాపారం చేసేవారు ఒక్కొక్కరు రూ.15 వేలు, బొమ్మలు తయారు చేసిన వారు రూ.25 నుంచి రూ.35 వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రూ.10 వేలకు విగ్రహాన్ని కొనుగోలు చేసి తక్కువకు ఇవ్వాలని అడిగినట్లు తర్వాత ఆ విగ్రహాన్ని ఆ వ్యాపారి ఇతరులకు అమ్మకం చేయడంతో ఈ సమస్య స్థానికులందరికీ తెలిసిపోయింది. ఈ విషయమై మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రతి మున్సిపాలిటీలో వినాయక విగ్రహాలు తయారు చేసినా, అమ్మకాలు చేసినా మున్సిపాలిటీకి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే తనతోపాటు సిబ్బంది వినాయక విగ్రహాల వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించాలని, రశీదులు ఇస్తామన్నారు. రూ.15 వేలకుగాను కొందరు రూ.7 వేలు, మరికొందరు రూ.15 వేలు చెల్లించారని మొత్తం రూ.43 వేలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తమ సిబ్బందిలో ఎవరైనా అక్కడికి వెళ్లి ఏదైనా చేసి ఉంటే విచారణ చేస్తామని, బొమ్మలు కొనుగోలుదారుల విషయంలో ఏదైనా సమస్యలు వచ్చినా తమకు సంబంధం లేదని ఆయన తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 11:18 PM