Share News

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:54 PM

వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన
వియవాడలోని తూర్పులంక 17వ వార్డులో వరద బాధితులకు దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మెడికల్‌ క్యాంపులు

బాధితులకు దుస్తులు, ఆహారం పంపిణీ

రాయచోటిటౌన, సెప్టెంబరు 5: వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు గురువారం విజయవాడలోని తూర్పుకృష్ణలంక 17వ వార్డులో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిలు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్య శిబిరం ద్వారా అందుబాటులో ఉన్న 67 రకాల మందులు, ఒక డాక్టర్‌, ఇరువురు హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఆశావర్కర్లు, సచివాలయం సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. 17వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య పనుల పట్ల అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో బాధితులకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు. ఆ కాలనీలో ఉన్న కుటుంబాలు పూర్తి స్థాయిలో వరదకు ప్రభావితం అయ్యాయని వారందరికీ ప్రభుత్వ పరంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తూ సహాయక చర్యలు క్షేత్రస్థాయిలో అందేలా చేస్తున్నామని అధికారులు తెలిపారు.

సహాయక చర్యల్లో మంత్రి బృందం

వరద బాధితులకు సహాయం అందించే విషయంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (రాముడు టీమ్‌) టీమ్‌ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటూ ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో అవసరమైన వారికి ఆహార పొట్లాలు పరిశుభ్రంగా ప్యాకింగ్‌చేసి ఆకలితో ఉన్న వారికి త్వరితగతిన వాహనాల ద్వారా అందజేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 11:54 PM