Share News

kakinada : తొలగని ఏలేరు ముంపు

ABN , Publish Date - Sep 13 , 2024 | 02:53 AM

కాకినాడ జిల్లా ఇంకా ఏలేరు వరదలోనే చిక్కుకొని ఉంది. ఒకపక్క జలాశయంలోకి ఇన్‌ఫ్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

kakinada : తొలగని ఏలేరు ముంపు

  • ప్రాజెక్టులో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం

  • 8 మండలాల్లో 64 గ్రామాలు అతలాకుతలం

  • నీటిలోనే నానుతున్న ఊళ్లు, పొలాలు

  • కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత

  • 206 గ్రామాల్లోని 75 వేల ఎకరాల్లో పంటలు మునక

  • పంట నష్టం రూ.180 కోట్లుగా అంచనా

కాకినాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఇంకా ఏలేరు వరదలోనే చిక్కుకొని ఉంది. ఒకపక్క జలాశయంలోకి ఇన్‌ఫ్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏలేరు వరద 8 మండలాల్లోని 64 గ్రామాలను అతలాకుతలం చేసింది. వేలాది ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లో నీటిలోనే నానుతున్నాయి. కుళ్లిపోయిన బురదలో కూరుకుపోయిన వరి చేలను చూసి అన్నదాతలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

కోళ్లఫారాల్లో వేలాది కోళ్లు చనిపోయి బయటకు తేలుతుండటంతో పౌలీ్ట్ర రైతులు ఆవేదన చెందుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు అటు ఏలేరు, అటు సుద్దగెడ్డ ప్రవాహాలతో వణుకుతున్నాయి. ఈ ప్రాంతాలు తేరుకోవడానికి మరో మూడు రోజులు పట్టేలా ఉంది. గొల్లప్రోలు ఎస్సీ కాలనీలో సుద్దగడ్డ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సూరంపేట చుట్టూ చేరిన ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గకపోవడంతో ప్రజలు బోటులో రాకపోకలు సాగిస్తున్నారు. ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం, సీతానగరం, లక్ష్మీపురం గ్రామాల్లోని పంటపొలాల్లో ముంపు మరింత పెరిగింది.

Untitled-1 copy.jpg

యు.కొత్తపల్లి చివరి మండలం కావడంతో నాలుగు రోజులుగా పోటెత్తిన ఏలేరు వరదంతా ఇప్పుడు సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ మండలంలోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో వందలాది ఇళ్లు, పంటలు ముంపులో చిక్కుకున్నాయి. కిర్లంపూడిలోని రాజుపాలెంలో గురువారం నాటికి వరద కొంచెం తగ్గడంతో బాధితులు ఇళ్లలో బురదపాలైన దుస్తులు, వస్తువులు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఆరబెట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 75వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తం 20 మండలాల్లో 206 గ్రామాల్లో పంటలు మునగడంతో 41వేల మంది రైతులు నష్టపోయారు. పంటనష్టం రూ.180కోట్లుగా అంచనా వేశారు.

Updated Date - Sep 13 , 2024 | 02:54 AM