Share News

ఆరోపణలున్నా అందలమే..

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:23 AM

దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

ఆరోపణలున్నా అందలమే..

దుర్గగుడి అంతర్గత బదిలీల అర్థాలే వేరు

ఇద్దరు సూపరింటెండెంట్ల బదిలీపై సందేహాలు

అవినీతి ఆరోపణలున్నా కీలక స్థానాలు కేటాయింపు

కాసులు ముట్టే స్థానాల్లో నియామకం

ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ

దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

ఆయనంతే.. మారరంతే..

కొద్దిరోజుల క్రితం జరిగిన బదిలీల్లో ఒక సూపరింటెండెంట్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. దత్తత దేవాలయాల బాధ్యతలు చూసే ఆయనకు టోల్‌గేట్‌, దుర్గాఘాట్‌ హారతులు, కేశఖండన శాల బాధ్యతలు ఇచ్చారు. ఎలాంటి మచ్చలు లేని సూపరింటెండెంట్‌కు ఈ బాధ్యతలు అప్పగించి ఉంటే దేవస్థాన ఉద్యోగ వర్గాల్లో చర్చ జరిగేది కాదు. కొన్నాళ్ల క్రితం ఈ సూపరింటెండెంట్‌ ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ టోల్‌గేట్‌ నిధుల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్టు ఈయనపై అభియోగాలు ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి సాధారణ బదిలీల్లో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు. కొన్ని నెలల పాటు ప్రసాదాలు, టికెట్‌ కౌంటర్ల బాధ్యతలను పర్యవేక్షించారు. భ్రమరాంబ ఈవోగా ఉన్నప్పుడు ప్రసాదాల కౌంటర్లలో పులిహోర ప్యాకెట్ల లెక్కల్లో తేడాలు వచ్చినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఈ సూపరింటెండెంట్‌పై ఆరోపణలు వచ్చాయి. అప్పటి పాలక మండలి చైర్మన్‌ నేరుగా ఆయన విషయంలో ఈవోతో యుద్ధానికి దిగారు. అయినా భ్రమరాంబ ఆయనను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆయన ఇంట్లో లెక్కలు లేని రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. భ్రమరాంబ ఇక్కడి నుంచి బదిలీ అయ్యాక ఆయన మళ్లీ విధుల్లో చేరారు. కొద్దిరోజుల క్రితం వరకు ఆయనకు దత్తత దేవాలయాలను అప్పగించారు. తాజాగా జరిగిన అంతర్గత బదిలీల్లో ఆయనపై అధికారులకు నమ్మకం పుట్టుకొచ్చింది. ఆదాయానికి కేంద్ర బిందువుగా ఉండే టోల్‌గేట్‌, కేశఖండన శాల బాధ్యతలను అప్పగించారు. ఆయనకు ఇంకా ఎటువంటి క్లీన్‌చిట్‌ రాకుండానే అధికారులు కీలక బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.

విధులు అక్కడ.. వేతనమిక్కడ

దేవదాయ ఉద్యోగుల అన్ని వ్యవహారాలు ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ పనిచేయడానికి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఉద్యోగులు తహతహలాడుతుంటారు. సిఫార్సుల్లో పోటీపడి మరీ పోస్టింగ్‌లు సంపాదించుకుంటారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో సూపరింటెండెంట్‌గా వ్యవహరించే ఓ ఉద్యోగి ప్రస్తుతం కమిషనర్‌ కార్యాలయంలో కీలక పోస్టులో ఉన్నారు. ఆయన విధులు కమిషనరేట్‌లో నిర్వర్తిస్తున్నా వేతనం మాత్రం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచే అందుకుంటారు. ఈయన కమిషనరేట్‌లో చక్కబెడుతున్న వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. కాసులు కురిపించే వ్యవహారాలను జోరుగా చక్కబెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సూపరింటెండెంట్‌ ఉద్యోగ నియామకంలోనూ వివాదాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈయన తెలంగాణలోని యాదాద్రి దేవస్థానంలో పనిచేశారు. విభజన తర్వాత అనూహ్యంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఇది దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 01:23 AM