Share News

సమస్యలు సమసేనా..?

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:25 AM

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి

సమస్యలు సమసేనా..?

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా..

పాల్గొననున్న కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు

వైసీపీ ఎమ్మెల్యేలు లేకుండా జరిగే మొదటి సమావేశం

ప్రధాన సమస్యల పరిష్కారంపైనే అందరి దృష్టి

మంత్రులు దిశానిర్దేశం చేస్తారని ఆశలు

ముఖ్య సమస్యలపై చర్చకు సభ్యుల పట్టు

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగే జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి పడింది. చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్‌ హాల్లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఐదేళ్ల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుండా జరిగే సమావేశం కూడా ఇదే కావడం విశేషం. - ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం

వైసీపీ ఎమ్మెల్యేలు లేని సమావేశం

గతం : జిల్లా పరిషత్‌లో 48 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అందులో 46 మంది వైసీపీకి చెందినవారే ఉన్నారు. పెడన, మోపిదేవి జడ్పీటీసీ స్థానాల్లోనే టీడీపీ సభ్యులున్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే ఉండేవారు. మచిలీపట్నం ఎంపీ స్థానం వైసీపీది కాగా, విజయవాడ ఎంపీ స్థానం టీడీపీకి ఉండేది.

ప్రస్తుతం : మేలో జరిగిన ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 16 మంది ఎమ్మెల్యేలు సహా రెండు ఎంపీ స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంది. దీంతో ఈసారి జరిగే జడ్పీ సమావేశంలో వైసీపీ తరఫున పాల్గొనే శాసనసభ్యులు, ఎంపీలు లేకుండాపోయారు. వైసీపీ పాలనలో మూడేళ్ల పాటు మంత్రుల హోదాలో వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, పేర్ని నాని జడ్పీ సమావేశాల్లో పాల్గొనేవారు. ఆ తరువాత రెండేళ్ల పాటు మంత్రి హోదాలో జోగి రమేశ్‌ అప్పుడప్పుడు పాల్గొనేవారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో మంత్రులుగా ఉన్న కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి మంత్రుల హోదాలో జడ్పీ సమావేశంలో పాల్గొననున్నారు. కూటమి తరఫున గెలిచిన 16 మంది శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాకపోవడంతో మరో ఐదేళ్ల వరకు జడ్పీ సమావేశంలో ఆ పార్టీ నుంచి పాల్గొనేందుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

పంట నష్టపరిహారం పక్కదారి

ఉమ్మడి జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో 3.20 లక్షల హెక్టార్లలో వివిధపంటల సాగు జరిగింది. డిసెంబరులో మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసింది. పెడన మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో వ్యవసాయ భూముల్లేని వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్మును జమ చేశారు. ఈ తరహాలో రూ.42 లక్షల వరకు పక్కదారి పట్టిందని వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. మచిలీపట్నం మండలంలోనూ నాలుగైదు గ్రామాలకు చెందిన రైతుల ఖాతాల్లో ఇంతవరకు పంట నష్టపరిహారం జమ కాలేదు. ఈ అంశంపై సమావేశంలో అధికారులను నిలదీసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు.

కాల్వల పూడికతీతే ప్రధాన అంశం

సాగునీటి ప్రధాన కాల్వలు, ప్రధాన డ్రెయిన్లలో మేటవేసి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించే పనులను ఇంకా సక్రమంగా చేయడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెనల వద్దకు కొట్టుకొచ్చిన గుర్రపుడెక్క, నాచును మాత్రమే తొలగించే పనులు చేస్తూ మమ.. అనిపిస్తున్నారు. పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేయడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కీలకమైన ఈ అంశంపై జడ్పీ సమావేశంలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

సాగునీటి ఎద్దడిపై కీలక చర్చ

ఉమ్మడి జిల్లాలో 3.20 లక్షల హెకార్టలో వరిసాగు జరుగుతోందని అంచనా. ఇప్పటివరకు 80 వేల హెక్టార్లలో సాగు జరిగింది. ఈ నెలలో పది రోజులు భారీ వర్షాలు కురవడంతో సాగునీటి ఎద్దడి కొంతమేర తీరింది. భారీవర్షాలు కురవడంతో పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. శుక్రవారం నుంచి మళ్లీ నీటి పంపింగ్‌ ప్రారంభించారు. ఈ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోవాలంటే కనీసం 36 గంటల సమయం పడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక్క టీఎంసీ నీరు మాత్రమే ఉండటంతో పట్టిసీమ నుంచి వచ్చే నీరు, వర్షాలు కురిస్తే అందుబాటులోకి వచ్చే నీరే వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా కనిపిస్తోంది. ఆగస్టులో వర్షాలు కురిస్తే సాగునీటి అవసరాలకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, ఆశించిన మేర వర్షాలు కురవకపోతే సాగునీటి ఎద్దడి తలెత్తుతుంది. కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదల, పంటలను రక్షించడంపై ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరగాల్సి ఉంది.

జగనన్న కాలనీల్లో వసతుల కల్పన ఏదీ..?

ఉమ్మడి జిల్లాలో 1,400కు పైగా జగనన్న లే అవుట్లు ఉన్నాయి. వాటిలో కనీస వసతులు లేవు. ఈ లే అవుట్లలో రహదారుల నిర్మాణం, తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీల్లోని రహదారులు చిత్తడిగా మారాయి. అక్కడ నివసించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీల్లో కనీస వసతులు కల్పించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమావేశంలో విద్య, గృహ నిర్మాణం, వైద్యం, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:11 AM