Share News

రథసారథులకు బ్రహ్మరథం

ABN , Publish Date - May 09 , 2024 | 01:06 AM

అరుదైన అపూర్వ ఘట్టానికి బెజవాడ వేదికైంది. మూడు ప్రధాన పార్టీల అధినేతల ప్రచార రథానికి బందరురోడ్డు బ్రహ్మరథం పట్టింది. బుధవారం రాత్రి నగరంలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌ షోకు జనం పోటెత్తారు. ప్రధాని మధ్యలో నిలబడగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెరోపక్క నిలబడి అశేష జనానికి అభివాదాలు చేశారు. కనులపండువగా సాగిన ఈ కలయికను చూసేందుకు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో బందరురోడ్డు కిక్కిరిసిపోయింది. రోడ్‌ షో మొత్తంలో ముగ్గురు నేతలు ఎలాంటి ప్రసంగం చేయకపోయినా.. జనాల జయజయధ్వానాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

రథసారథులకు బ్రహ్మరథం

ప్రభంజనంలా ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌ షో

బందరురోడ్డుకు భారీగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు

ప్రధానితో కలిసి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అభివాదం

ఐజీఎంసీ నుంచి బెంజిసర్కిల్‌ వరకు సాగిన రోడ్‌ షో

అడుగడుగునా పండుగ వాతావరణంలా ఏర్పాట్లు

భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య ముందుకు సాగిన నేతలు

అణువణువూ జల్లెడ పట్టిన భద్రతా సిబ్బంది

అరుదైన అపూర్వ ఘట్టానికి బెజవాడ వేదికైంది. మూడు ప్రధాన పార్టీల అధినేతల ప్రచార రథానికి బందరురోడ్డు బ్రహ్మరథం పట్టింది. బుధవారం రాత్రి నగరంలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌ షోకు జనం పోటెత్తారు. ప్రధాని మధ్యలో నిలబడగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెరోపక్క నిలబడి అశేష జనానికి అభివాదాలు చేశారు. కనులపండువగా సాగిన ఈ కలయికను చూసేందుకు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో బందరురోడ్డు కిక్కిరిసిపోయింది. రోడ్‌ షో మొత్తంలో ముగ్గురు నేతలు ఎలాంటి ప్రసంగం చేయకపోయినా.. జనాల జయజయధ్వానాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి) : బందరురోడ్డు జనసంద్రాన్ని తలపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్‌ షోకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి మొదలైన రోడ్‌ షోలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొన్నారు. రోడ్‌ షో.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైనప్పటికీ జనం నిలబడే గ్యాలరీలు మాత్రం పీవీపీ మాల్‌ నుంచి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జనానికి అభివాదాలు చేసుకుంటూ ముగ్గురు నేతలు ముందుకుసాగారు. కాగా, రోడ్డుకు కుడివైపున బీజేపీ నేతలు పది రకాల వేదికలను ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికపై ఒక్కో మతంవారు స్వాగతం పలికేలా వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. రోడ్డు మొత్తాన్ని బ్లాక్‌లుగా, గ్యాలరీలుగా విభజించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఆయా గ్యాలరీల్లోకి పంపారు. మంచినీళ్ల సీసాలను కూడా అనుమతించలేదు. ఎంజీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటపాటు రోడ్‌ షో సాగగా, ముగ్గురు నేతలకు జనం జేజేలు పలికారు. రోడ్డు షో ముగిసే సమయంలో బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న వేదిక దగ్గర తోపులాట జరిగింది. గ్యాలరీల్లో ఉన్న వారంతా బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ ప్రధాని వాహనం వెంట వచ్చారు. దీంతో అప్పటికే ఎండ్‌ పాయింట్‌ వద్ద జనం ఎక్కువగా ఉన్నారు. ముందున్న వారంతా ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. షో ముగిసిన తర్వాత జనం బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పటికే ముగ్గురు నేతలు విశ్రాంతి గదిలో ఉండటంతో పోలీసులు ఎవరినీ బయటకు పంపలేదు. చివరికి బారికేడ్లను తొక్కుకుంటూ జనం బయటకు వచ్చారు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు.

మార్షల్‌ ఆర్ట్స్‌పై ప్రత్యేక ప్రదర్శన

మోదీ రోడ్‌ షో సందర్భంగా కొంతమంది క్రీడాకారులు మార్షల్‌ ఆర్ట్స్‌పై ప్రత్యేక ప్రదర్శన చేశారు. బెంజిసర్కిల్‌ పెట్రోలు బంకు వద్ద ఈ ప్రదర్శన నిర్వహించారు. ఆపద సమయంలో యువతులు ఎలా ఎదుర్కోవాలో క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ ప్రదర్శనను మహిళలు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - May 09 , 2024 | 01:06 AM