Share News

ఎన్నికల విధుల్లో అధికారుల పాత్ర కీలకం

ABN , Publish Date - May 09 , 2024 | 12:59 AM

సాధారణ ఎన్నికల పోలింగ్‌ సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు.

ఎన్నికల విధుల్లో అధికారుల పాత్ర కీలకం
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి

గుడివాడ రూరల్‌, మే 8 : సాధారణ ఎన్నికల పోలింగ్‌ సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు బుధవారం స్థానిక వీకేఆర్‌వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోలింగ్‌ ముందు రోజు రిసెప్షన్‌ సెంటర్‌కు ఉద్యోగులు సకాలంలో చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయటం జరుగుతుందన్నారు. దివ్యాంగులు, గర్భవతులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు గల వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని, చిన్న చిన్న అనారోగ్య కారణాలతో మినహాయింపు కోరవద్దని సూచించారు. శిక్షణకు వచ్చిన అందరూ ఎన్నికల సంఘం ఉద్యోగులుగా పరిగణింపబడతారన్నారు. ప్రిసైడింగ్‌ అధికారుల హ్యాండ్‌ బుక్‌ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని సూచిస్తూ, నిబంధనల పట్ల అవగాహన కలిగి, అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికాకుండా పోలింగ్‌ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఉద్దేశపూరకంగా పొరపాటు చేస్తే సహించబోమని, పొరపాట్లపై థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారని కలెక్టర్‌ తెలిపారు. బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌లను కనెక్ట్‌ చేయటంలో సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలన్నారు. గుడివాడ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో పి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:00 AM