Share News

Free Sand: ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..

ABN , Publish Date - Sep 19 , 2024 | 08:46 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్‌ను అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Free Sand: ఏపీలో  నేటి నుంచి ఉచిత  ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (AP State)లో గురువారం నుంచి ఉచిత ఇసుక (Free sand) ఆన్‌లైన్ బుకింగ్ (Online Booking) విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్‌ను (Portal) అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఇసుక రవాణా దారుల వరకు ఎలాంటి తప్పులు చెయ్యకుండా పోర్టల్ రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. ఇసుక స్టాక్ ఎంత ఉంది... సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలతో పోర్టల్ రూపొందించారు. 2వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలో... 2వేల చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాలి. ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్, యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కావాల్సినవారు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.


కాగా ఈ నెల 11న ఉచిత ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, విజయవాడలోని వరద సహాయ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా, అధికారులు బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదు. అక్టోబర్ నెల నుంచి నదుల్లోని రీచ్‌ల్లో తవ్వకాలు మొదలుకానున్నాయి. దీంతో ఉచిత ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులను నియమిస్తారు. గనులశాఖ, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, భూగర్భజలవనరులు.. తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది.


కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.


ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే...

గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జులైలో జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది.

49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్..

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..

వైసీపీకి బిగ్‌ షాక్‌

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 19 , 2024 | 08:46 AM