ఆశలు ఆవరి!
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:54 AM
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలవాలటంతో రైతులు దిగాలు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవటంతో తలలు పట్టుకుంటున్నారు. కోత మిషన్‌తో కోయిద్దామన్నా భూమిలో గట్టిదనం లేక యంత్రాల చక్రాల కింద పంట నలిగిపోతుండటంతో పొలాలను పంటతో సహా చేలల్లోనే రైతులు వదిలేస్తున్నారు.
పంట చేతికొచ్చే సమయానికి తుపాను దెబ్బ!
గాలులకు నేల వాలిన వరి పంట
కూలీల కొరత.. అందుబాటులో లేని యంత్రాలు
చేలల్లోనే పంట వదిలేస్తున్న రైతులు
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలవాలటంతో రైతులు దిగాలు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవటంతో తలలు పట్టుకుంటున్నారు. కోత మిషన్‌తో కోయిద్దామన్నా భూమిలో గట్టిదనం లేక యంత్రాల చక్రాల కింద పంట నలిగిపోతుండటంతో పొలాలను పంటతో సహా చేలల్లోనే రైతులు వదిలేస్తున్నారు.
(జగ్గయ్యపేట రూరల్, ఆంధ్రజ్యోతి)
ఇటీవల వచ్చిన తుపాను గాలులకు కోతకు వచ్చిన వరి నేలకొరగటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేలపై పడిన వరిని కూలీలు ఇబ్బంది లేకుండా కోస్తారు. కానీ.. ప్రస్తుతం కూలీల కొరత.. యంత్రాలతో కోయటం.. పొలాలు ఆరకపోవటంతో పంట నలిగి గ్రాసం (వరి గడ్డి) కూడా బురదతో పనికి రాకుండా పోతున్నది. అనుమంచిపల్లి ఆర్‌బీకే పరిధిలో 1683 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఆది నుంచి వర్షాలు అదునుకు కురవక, సాగర్ జలాలు రాక అరకొరగా ప్రారంభమైన సాగు వరదలతో ఆటుపోట్లకు గురైనా రైతులు నిరాశ చెందలేదు. నాటుకు రూ. 5వేలు, సస్యరక్షణ, బలం, తదితర మందులకు రూ. 5వేలు, ట్రాక్టర్ దుక్కలకు రూ. 7వేలు, కౌలు రూ.21వేల చొప్పున ఖర్చుచేసి మరీ సాగుచేశారు. పంట చేతికి వస్తుందన్న సమయంలో అధిక వర్షాలు, గాలుల కారణంగా నేలకొరగటం భూమి గట్టిగా లేకపోవటంతో అదే సమయంలో కూలీల కొరత కారణంగా యంత్రాలతో కోయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎకరా పంటను గంటలో కోసే యంత్రాలు ప్రస్తుతం మూడు, నాలుగు గంటలు పడుతుండటంతో అదనంగా మరో రూ.9వేలు చెల్లించాల్సి వస్తున్నది. పంటను కోయించినా పశుగ్రాసం నేలపాలవుతుంది. మరోవైపు యంత్రాల కొరతతో పంటలు మొలకెత్తుతున్నాయి. నేల గట్టిగా ఉంటే రోజుకు 20 ఎకరాలు కోసే యంత్రాలు ప్రస్తుతం నాలుగైదు ఎకరాలకు మించి కోయటం లేదని రైతులు అంటున్నారు.
15 ఎకరాలు సాగు చేశా
- కొడాలి శంకరయ్య, రైతు
రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి 15 ఎకరాలు సాగు చేశా. నేల గట్టి పడకపోవటంతో రెండెకరాల్లో పంటను వదిలేయాల్సి వచ్చింది. పంటను మార్కెట్‌కు తరలించినా రూ. 2లక్షలకు మించి వచ్చేలా లేదు. పశుగ్రాసం కూడా నేలపాలైంది.
ఖర్చులు అధికంగా ఉన్నాయి
- సాయి కిరణ్, రైతు
పంట కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయి. పంట నేలకొరగటంతో యంత్రాలతో కోయిస్తే రూ. 16 వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేలా లేదు. వరి పొలాలు కోత కోయించటం కంటే వదిలేయటమే మంచిదని సాగు చేసిన నాలుగెకరాల పంటను వదిలేశా. ప్రభుత్వం రైతులకు రాయితీపై వరి కోత యంత్రాలను అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.