Share News

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:20 PM

ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..
YSRCP Leaders

ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట. తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి సైతం నాయకులు అందుబాటులో ఉండటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నాయకులు.. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండటంతో పాటు.. తమ ముఖ్య అనుచరులకు టచ్‌లో లేకుండా పోయారట. కొందరు సీనియర్ నేతలు అయితే నియోజకవర్గంలోనే లేరట. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బనాయించిన తప్పుడు కేసులు, అక్రమాలు, అవకతవకలపై సమీక్షించి.. చర్యలు తప్పవని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతోంది. ఓవైపు తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయిస్తూనే.. మరోవైపు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయం వెంటాడుతోందట. కొందరు స్థానిక నాయకులైతే అవకాశం ఇస్తే టీడీపీ, జనసేనలో చేరిపోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల్లో చేరాలంటే ఇప్పటికే పలు కండీషన్లు పెట్టారట. గతంలో టీడీపీ, జనసేన నాయకులపై రాజకీయ కక్షతో కేసులు బనాయించి, దాడులకు పాల్పడిన నాయకులకు పార్టీలో చోటులేదని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వైసీపీలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..


అప్పుడప్పుడు..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షాలపై ప్రతిరోజు విరుచుకుపడే నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కొందరు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినా విమర్శల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్లుగా పేరొందిన కొందరు నాయకుల ఆచూకీనే కనబడటం లేదట. ముఖ్యంగా మాజీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ధర్మాన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ తెలియడం లేదట. దేశంలోనే ఉన్నారా.. విదేశాలకు వెళ్లిపోయారో తెలియడం లేదట. ఇక పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ కనిపించడంలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నాయకులంతా ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో వైసీపీ మరింత బలహీనపడుతూ వస్తోందట.

Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!


ఓవైపు అధినేత..

వైసీపీ అధినేత జగన్ సైతం రాష్ట్రంలో తక్కువుగా ఉంటున్నారు. వారంలో రెండు రోజులు తాడేపల్లిలో ఉంటే మిగతా రోజులు బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. అధినేత బాటలోనే మిగతా పార్టీ నాయకులు నడుస్తున్నారట. కీలక నాయకులు అందుబాటులో ఉండకపోవడంతో ఇక పార్టీ శ్రేణులు సైతం కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ డిబేట్లలో సైతం వైసీపీ కీలక నాయకులు ఎవరూ కనిపించడం లేదు. ఎన్నికల ముందు అసంతృప్తితో ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నాయకులే డిబేట్లలో కనిపిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఎన్నికల నాటికి ఏపీలో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందనే చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో వైసీపీ నాయకుల తీరు మారుతుందా.. లేదంటే ఇదే తరహాలో ఉంటుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.


Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 03:20 PM