Share News

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం.. ఆర్డీవో బాలకృష్ణ

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:56 AM

నందిగామలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 54 సేకరణ కేంద్రాలు, ఆరుమిల్లలను సిద్ధం చేసింది. బీపీటీ రకం క్వింటాకు రూ.2,320గా నిర్ణయించారు. తేమ శాతం 17 వరకూ ఉండవచ్చని స్పష్టం చేసింది.

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం.. ఆర్డీవో బాలకృష్ణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఆర్డీవో బాలకృష్ణ

నందిగామ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : నందిగామలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 54 సేకరణ కేంద్రాలు, ఆరుమిల్లలను సిద్ధం చేసింది. బీపీటీ రకం క్వింటాకు రూ.2,320గా నిర్ణయించారు. తేమ శాతం 17 వరకూ ఉండవచ్చని స్పష్టం చేసింది. తేమ శాతం పెరిగితే ఒక్కొక శాతానికి కిలో చొప్పున గరిష్టంగా ఐదుకిలోలు మాత్రమే తగ్గించేలా నిబంధన విధించి పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది నూర్పిళ్ల సమాచారం సేకరిస్తున్నారు. రైతు ప్రాతిపదికగా ధాన్యం చేతికి వచ్చే సమయాన్ని తెలుసుకొని వారికి కొనుగోలు తేదీని చెబుతున్నారు. దీనివల్ల రైతులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లో రైతు ఖాతాలోకి నగదు జమయ్యేలా చర్యలు చేపట్టినట్టు ఆర్డీవో తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర కష్టాలు!

గత ప్రభుత్వ హయాంలో సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ము చెల్లింపులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఆర్బీకేలు మొత్తం వైసీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకొని రైతులకు ఉచితంగా అందించాల్సిన గన్నీ బ్యాగ్‌లను అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఘటనలున్నాయి. కాటాల కోసం రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. తీరా కాటాలకు వచ్చే సమయంలో మరో మారు తేమ పరిక్షలు నిర్వహించి అదనపు కోతలు విధించే వారు. నాటి పాలకులు, అధికారులు, సిబ్బంది కలిసి అన్నదాతను అష్టకష్టాలకు గురిచేశారు. ఈ వెతలు పడలేక రైతులు గ్రామాలలో దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పలుచోట్ల సిబ్బందిని నిర్బంధించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గత అనుభవాలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. తిరువూరు డివిజన్‌లో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్న ప్రభుత్వం రైతుల నుంచి సమర్థవంతంగా కొనుగోళ్లు చేస్తూ.. 48 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమౌతున్నట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం ఆర్డీవో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలందించడం ద్వారా దళారులను ఆశ్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే గన్నీ బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నందున క్రమ పద్ధతిలో రైతులకు అందించాలని ఆదేశించారు. కాటాలు, తేమశాతం విషయాలలో ఎక్కడ అవకతవకలు జరిగినా అధికారులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా క్రమ పద్ధతిని పాటించి మంచి ధర అందుకోవాలని సూచించారు.

Updated Date - Nov 21 , 2024 | 12:56 AM