Share News

జంక్షన్‌లో జనమే జనం

ABN , Publish Date - May 09 , 2024 | 01:04 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హనుమాన్‌ జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ద్విచక్రవాహనాలు, ఆటోల్లో జనం హాజరయ్యారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా సభా వేదిక సమీపంలోని భవనాలపైకి ఎక్కి పవన్‌ కోసం వేచి చూశారు.

జంక్షన్‌లో జనమే జనం

పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభ విజయవంతం

మండుటెండలో వేచి ఉన్న అభిమానులు, కార్యకర్తలు

సౌమ్యంగా మాట్లాడి ఆకట్టుకున్న జనసేనాని

ప్రధాన సమస్యల పరిష్కారానికి అభయం

హనుమాన్‌ జంక్షన్‌/హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌, మే 8 : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హనుమాన్‌ జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ద్విచక్రవాహనాలు, ఆటోల్లో జనం హాజరయ్యారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా సభా వేదిక సమీపంలోని భవనాలపైకి ఎక్కి పవన్‌ కోసం వేచి చూశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్‌ సభాస్థలి వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.20 గంటల వరకూ సభ జరిగింది. జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్‌బాబు ప్రారంభోపన్యాసం చేశారు. తరువాత గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత పవన్‌ ప్రసంగించారు. రహదారిపై ప్రత్యేక వాహనం మీద వారాహి విజయభేరి పేరుతో వేదిక ఏర్పాటు చేశారు.మూలకొట్టు సెంటర్‌ నుంచి హెచ్‌ మార్ట్‌ వరకు రహదారి రెండు మార్గాల్లోనూ భారీ ఎత్తున జనం నిండిపోయారు. విజయవాడ నుంచి జంక్షన్‌ చేరుకునే వరకు దారి పొడవునా అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, వీరమహిళలు నీరాజనాలు పలికారు.

టీ గ్లాసుతో ఉత్సాహం

మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఉదయం 10 గంటలకే సభావేదిక వద్దకు చేరుకున్నారు. పవన్‌ రావడం ఆలస్యం అవుతుందని తెలిసి కాలక్షేపం కోసం వేదిక సమీపంలో ఉన్న టీ దుకాణంలోకి వెళ్లి టీ తాగారు.తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు కూడా టీ ఇప్పించారు. తాగుతున్న టీ గ్లాసును పైకి చూపిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పవన్‌ వచ్చేంత వరకు సమయం వృథా చేయకుండా బాపులపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:04 AM