Share News

ఈ సీటు.. వెరీ స్వీటు!

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:24 AM

ఆ సీటంటే తహసీల్దార్లకు భలే స్వీటు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో సొంత జిల్లాలకు వస్తున్నవారు దీనిపై కన్నేశారు. ఇంతకీ ఎక్కడుంది ఈ సీటు? ఏమా స్వీటు కథ? అనుకుంటున్నారా? అయితే విజయవాడ రూరల్‌ మండలానికి వెళ్లాల్సిందే.

ఈ సీటు.. వెరీ స్వీటు!

విజయవాడ రూరల్‌ మండల తహసీల్దార్‌ కోసం పైరవీలు

ఆ సీటంటే తహసీల్దార్లకు భలే స్వీటు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో సొంత జిల్లాలకు వస్తున్నవారు దీనిపై కన్నేశారు. ఇంతకీ ఎక్కడుంది ఈ సీటు? ఏమా స్వీటు కథ? అనుకుంటున్నారా? అయితే విజయవాడ రూరల్‌ మండలానికి వెళ్లాల్సిందే.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రూరల్‌ మండల తహసీల్దార్‌గా రావడానికి పోటీ మామూలుగా లేదు. పైరవీలు కూడా అదే స్థాయిలో జోరుగా సాగుతున్నాయి. ఎవరికి తోచినట్టు వారు రాజకీయంగానూ, సీసీఎల్‌ఏ స్థాయిలోనూ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నగర పరిధిలో గతంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్‌ కన్ను దీనిపై పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసే ఆ మహిళా తహసీల్దార్‌ తమ నాయకుడి ఆశీస్సులతో ఈ స్థానంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి పనిచేసిన ఆమెకు ప్రస్తుతం ఆ పార్టీ నాయకుడు కూడా సహకరిస్తున్నాడు.

గతంలో గ్రేటర్‌ విజయవాడ విలీన జాబితాలో ఉన్న ఒక మండల పరిధిలో పనిచేసిన మరో అధికారి కూడా రూరల్‌ తహసీల్దార్‌గా వచ్చేందుకు తెగ తహతహలాడిపోతున్నారు. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ఏపీఆర్‌ఎస్‌ఏ)లో కీలకంగా ఉన్న ఈయన కూడా గతంలో వైసీపీ ఎమ్మెల్యేకు వీరవిధే యుడిగా పనిచేశారు. మట్టి, గ్రావెల్‌.. ఇలా దేనినీ వదిలిపెట్టకుండా అప్పటి అధికార పార్టీ సాగించిన అక్రమాలకు సహకరించారు. ఈ వ్యవహారాల్లో వాటాలను కూడా పొందారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వీటితో పాటు గతంలో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో అడ్డగోలుగా వ్యవహరించారని, తక్కువ ధర కలిగిన భూములను ఎక్కువ ధరకు కొన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

కాసులే కాసులు

ఇంతకీ విజయవాడ రూరల్‌ మండలానికి ఎందుకంత డిమాండ్‌ అంటే.. ఈ ప్రాంతంలో సీలింగ్‌, అటవీ భూములు, కొండలు, పోలవరం కాల్వగట్టు అధికంగా ఉండటమే. అక్రమార్కులకు సహకరిస్తే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ కారణంగానే విజయవాడ రూరల్‌ మండల తహసీల్దార్‌ పోస్టు కోసం పైరవీలు తారస్థాయికి చేరాయి.

Updated Date - Jul 27 , 2024 | 01:24 AM