Share News

విజిలెన్స్‌ విచారణ పక్కదారి..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:26 AM

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్‌మాల్‌ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.

విజిలెన్స్‌ విచారణ పక్కదారి..!

ఆర్‌డబ్ల్యూఎస్‌లో కంప్యూటర్ల కొనుగోల్‌మాల్‌ వ్యవహారంలో..

విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ముడుపుల మాయతో ఆర్‌డబ్ల్యూఎస్‌ విచారణగా మార్పు

విచారణ సవ్యంగానే సాగేనా.. అనే అనుమానాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్‌మాల్‌ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. అంతేకాదు.. నగరంలోని రిటైల్‌ డీలర్‌ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థను వివరణ కోరింది. కంప్యూటర్లను కొనటానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయం అనుమతులు కోరిందా? మీ పర్యవేక్షణలోనే కొనుగోళ్లు జరిగాయా? ఎంత ధర నిర్ణయించారన్న వివరాలను అడిగింది. అయితే, కంప్యూటర్ల కొనుగోలుపై ఆర్‌డబ్ల్యూఎస్‌ తమను సంప్రదించలేదని ఏపీటీఎస్‌ఎల్‌ చెప్పడంతో ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌.. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయాన్ని వివరణ కోరారు. సమాధానాలు సంతృప్తికరంగా రాకపోవడంతో ఆయన విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.

విచారణను మార్చేశారు..!

దొరికిపోతామన్న ఉద్దేశంతో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయ అధికారులు విజిలెన్స్‌ విచారణను నీరుగార్చారు. విజిలెన్స్‌ విచారణను మార్చేసి.. ఆర్‌డబ్ల్ల్యూఎస్‌ విజిలెన్స్‌ బృందం ద్వారా విచారణ జరిపేలా ఆదేశాల్లో మార్పు చేశారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలను కూడా కాదని, ఆర్‌డబ్ల్యూఎస్‌ అంతర్గత విజిలెన్స్‌కు విచారణ అప్పగించటంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ అంతర్గత విజిలెన్స్‌లో ఒక డీఈ స్థాయి అధికారి ఉంటారు. ఒక సీఈ జరిపిన వ్యవహారంపై కిందిస్థాయి డీఈ విచారణ చేయగలరా? ఒకవేళ చేసినా పారదర్శకంగా జరుగుతుందా? అనేది సందేహమే. కిందిస్థాయి అధికారులను ఉన్నతాధికారులు లొంగదీసుకునే అవకాశం ఉండదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటపుడు విచారణ పారదర్శకంగా జరుగుతుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. విజిలెన్స్‌ విచారణ మార్చిన వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేది కావడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 27 , 2024 | 08:28 AM