AP Politics: వైసీపీని ఓడించింది వాళ్లే.. జగన్ తీరుపై సొంత నేతల ఆగ్రహం..
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:27 AM
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రజల తీర్పు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ కొందరు నాయకులు బాధపడుతున్నారు. నియోజకవర్గంలో మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ మరికొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రజల తీర్పు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ కొందరు నాయకులు బాధపడుతున్నారు. నియోజకవర్గంలో మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ మరికొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకులను ఓటర్లు ఓడించడానికి అధినాయకుడి తీరు అసలు కారణమంటూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా తనను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనే అహంకారమే తమ ఓటమికి కారణమని మాజీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెప్పేందుకు కూడా అవకాశం కల్పించకపోవడం, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా.. కొందరు సలహదారులు, అధికారుల మాటలు వినడంతోనే ఇంతటి ఘోరపరాజయాన్ని ఎదుర్కొవల్సి వచ్చిందని మరికొందరు నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. తాము ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలిచే వాళ్లమంటున్నారు.
నాయకుడి మెప్పు కోసం అసలు విషయాలను దాచిపెట్టి తాము తప్పుచేశామని ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. అధికారం శాశ్వతమనే భావనతో అధినేత తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని మరికొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినాయకుడితో పాటు.. సలహదారుల మాటలు విని అతిగా ప్రవర్తించి ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ నాయకులతో శత్రుత్వం పెంచుకున్నామని.. ఇదే తమ రాజకీయ భవిష్యత్తు నాశనానికి కారణమంటూ కొందరు నాయకులు తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరే కారణమా..
ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సీఎం తెలియజేసేది ఎమ్మెల్యేలే. అయితే జగన్ గత ఐదేళ్లలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నిర్లక్ష్యం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సొంత పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని.. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. గుడ్డిగా వాళ్లే ఓట్లు వేస్తారనే అతి విశ్వాసంతో ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఏదైనా పని కోసం వెళ్తే అధికారులతో మాట్లాడమని చెప్పేవారని.. కొందరు అధికారులు తమ మాటలను పట్టించుకునేవారు కాదని.. కేవలం ఒకరిద్దరు ముఖ్య నాయకుల ఆదేశాల ప్రకారమే సీఎంవో అధికారులు పనిచేసేవారని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఓటమి తర్వాత అసలు నిజాలను ఆ పార్టీ నాయకులు బయటపెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల ముందు వరకు సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డితో పాటు.. మే నెల వరకు సీఎం కార్యదర్శిగా ఉన్న ధనుంజయరెడ్డి వ్యవహారశైలి కారణంగానే వైసీపీ ఇంతటి ఘోర పరాజాయాన్ని చవిచూడాల్సి వచ్చిందని కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో ప్రస్తుత ఓటమికి కారణం ఎవరంటే అన్ని వేళ్లు ఆ ఇద్దరి వైపే చూపిస్తున్నాయట.
ఓపెన్ అయిపోయిన నాయకులు..
ఎన్నికల ముందు వరకు ఓహో.. అహో.. సింహం సింగిల్‌గా వస్తుందంటూ ప్రశంసలు కురిపించిన వైసీపీ నాయకులు.. ప్రస్తుతం తమ పార్టీ అధినేత జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నాయకులు ఒక అడుగు ముందుకువేసి.. జగన్ రాజకీయాలకు పనికిరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే అధినేత తప్పులను బయటకు చెప్పి ఉంటే పార్టీకి ఎంతోకొంత లాభం జరిగేదని.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమిటనే చర్చ మరోవైపు సాగుతోంది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు మరికొంతమంది సీఎంవో అధికారులపై బహిరంగంగానే అనేక ఆరోపణలు చేశారు. ఓటమి తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా బయటకువచ్చి అధినేత వైఫల్యాలను బహిరంగంగానే చెబుతున్నారు. సొంత పార్టీ నాయకులే జగన్‌ను విమర్శిస్తుండటంతో ఆయన రాజకీయభవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Ganababu: మరో నెలలో వైసీపీ సగం ఖాళీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News