Share News

టీటీడీ చైర్మన్‌గా ఆర్యవైశ్యులు అనర్హులు!

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:32 AM

టీటీడీ చైర్మన్‌ అంటే భక్తులకు విశేషంగా సేవలు అందించాలి. దీనికి తిరుమల, తిరుపతిలోనే ఎక్కువ సమయం గడపాలి.

టీటీడీ చైర్మన్‌గా ఆర్యవైశ్యులు అనర్హులు!
TG Venkatesh

డిక్లరేషన్‌పై జగన్‌ రాద్ధాంతం: టీజీ

తిరుపతి అర్బన్‌, సెప్టెంబరు 29: ‘టీటీడీ చైర్మన్‌ అంటే భక్తులకు విశేషంగా సేవలు అందించాలి. దీనికి తిరుమల, తిరుపతిలోనే ఎక్కువ సమయం గడపాలి. మా కులస్థుందరికీ వ్యాపారాలతో ముడిపడి ఉండడంతో అది సాధ్యపడదు. అందుకే టీటీడీ చైర్మన్‌ పదవికి ఆర్యవైశ్యులు అనర్హులు’ అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తమ వాళ్లు తన పేరు చెప్పుకోవడంలో తప్పులేదని, అయినా తనకలాంటి కోరికలు లేవని, నామినేటెడ్‌ పోస్టులకు తాను అనర్హుడినని తెలిపారు.


గవర్నర్‌గా పనిచేయాలనే ఆలోచన అంతకంటే లేదని చెప్పారు. ఇంట్లో తిరుమల సెట్టింగ్‌ వేసినా జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ, డిక్లరేషన్‌పై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. భూమన కరుణాకర్‌రెడ్డి నాస్తికుడని, వైవీ సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్థురాలని, అలాంటి వారిని టీటీడీ చైర్మన్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీనెయ్యి కలపడంతో హిందూసమాజం రగిలిపోతోందన్నారు. నేరస్థులకు కచ్చితంగా శిక్ష తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును త్వరగా తేల్చేయాలని కోరారు. గత ఐదేళ్లలో టీటీడీలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. హైడ్రా బాధితులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని టీజీ వెంకటేష్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Sep 30 , 2024 | 07:44 AM