Share News

మెలకువలతో మేలైన దిగుబడులు: జేసీ

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:54 PM

రైతులు పంటల సాగులో సాంకేతిక పరమైన మెలకువలు తెలుసుకుని తద్వారా మేలైన దిగుబడులు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సూచించారు.

మెలకువలతో మేలైన దిగుబడులు: జేసీ
అధికారులలో చర్చిస్తున్న జేసీ విష్ణుచరణ్‌

నంద్యాల రూరల్‌, జూలై 26: రైతులు పంటల సాగులో సాంకేతిక పరమైన మెలకువలు తెలుసుకుని తద్వారా మేలైన దిగుబడులు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సూచించారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రంతో పాటు వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో చర్చించారు. జేసీ మాట్లాడుతూ పంటల సాగులో రసాయనిక ఎరువులు తగ్గించి, సేంద్రియ పద్దతిలో పంటలు పండిస్తే మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్నారు. అంతకుముందు సేవా కేంద్రంలోని డి..క్రిష్‌ ద్వారా విత్తనాలు, కియోష్క్‌ ద్వారా ఎరువులు అందించే ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. అలాగే మట్టి నమూనా సేకరణ గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిల్లలాపురం గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నట్లు, వరి సాగు రైతులకు 50 శాతం సబ్సిడీతో 25 క్వింటాల జీలుగ విత్తనాలు అందించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ జేసీకి వివరించారు. గ్రామ విత్తన ఉత్పత్తి పథకం ద్వారా రెండు యూనిట్ల (60 బస్తాలు) కర్నూలు సోనా బీపీటీ 5204 రకం ఫౌండేషన్‌ వరి విత్తనాలను అందించినట్లు తెలిపారు. ఫౌండేషన్‌ విత్తనాల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలను వారే సమకూర్చుకుంటారని తెలియజేశారు. వరి నాటు వేసే సమయంలో, దుబ్బు వేసేటపుడు, వెన్నుదశలో, ఉపయోగించాల్సిన ఎరువుల గురించి వివరించారు. కార్యక్రమంలో నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌, ఏవో ప్రసాదరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:54 PM