Share News

వైసీపీ భటుల పైరవీలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:26 PM

ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వానికి అంటకాగిన సీఐలు ఆదాయం ఉండే స్టేషన్లలో తిరిగి పోస్టింగులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు.

వైసీపీ భటుల పైరవీలు

ఐదేళ్లుగా వైసీపీకి అంటకాగి తిరిగి పోస్టింగ్‌ కోసం సీఐల పోటీ

పాణ్యం, కర్నూలు రూరల్‌, ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్లకు డిమాండ్‌

ఆదాయ మార్గాలు చూపుతూ ఎమ్మెల్యేలకు ఎర

ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు

భారీగా సొమ్ములు ముట్టజెప్పేందుకూ వెనుకాడని వైనం

వైసీపీ నాయకులతోనే ఫోన్లు చేయించి బేరసారాలు

టీడీపీ వచ్చాక కూడా ఇదే పరిస్థితి

ఆవేదన వ్యక్తం చేస్తున్న లూప్‌లైన్‌లో ఉన్న సీఐలు

కర్నూలు, జూలై 26: ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వానికి అంటకాగిన సీఐలు ఆదాయం ఉండే స్టేషన్లలో తిరిగి పోస్టింగులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు. పూర్తిగా వైసీపీ నాయకుల చెప్పుచేతుల్లో పని చేసిన వారంతా మళ్లీ తమకు నచ్చిన స్టేషన్ల కోసం పైరవీలు సాగించడం చూసి పలువురు విస్తుపోతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైసీపీ నాయకులు చెప్పినట్లు తలాడించారు. ఈ ఐదేళ్లలో సాధారణ ప్రజలు పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కాలంటే భయపడేలా చేశారు. ఒక్క సుధీర్‌ కుమా ర్‌ రెడ్డి పని చేసిన 11 నెలలు మినహాయించి మిగతా కాలమంతా వైసీపీ కనుసన్నల్లోనే పోలీసు అధికారులు మెలిగారు. ప్రభుత్వం మారింది.. టీడీపీ అధికారంలోకి వచ్చింది.. పోలీసు శాఖల రూపురేఖలు మారుతా యి.. సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చేలా ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పని చేసిన సీఐలు, ఎస్‌ఐలు మళ్లీ పోస్టింగుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చూసి పలువురు నివ్వెరపోతున్నారు. ఇంతకాలం లూప్‌లైన్‌లో ఉండి ప్రభుత్వం మారితే తమకు అవకాశం వస్తుందని భావించిన సీఐలు నిట్టూర్పుతో ఉన్నారు.

పోస్టింగ్‌ కోసం పోటాపోటీ..

వైసీపీ హయాంలో పని చేసిన సీఐలు ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి టీడీపీ నాయకులను ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పుడేమో మళ్లీ పోస్టింగ్‌ల కోసం పోటీ పడుతున్నారు. జూన్‌ 4న ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ రెండు నెలల కాలం వారికి చాలా కలిసొచ్చింది. ఫలితాలు వచ్చిన వెంటనే నేతల ముంగిట గద్దల్లా వాలిపోయారు. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా పోస్టింగ్‌ కొట్టేయాలని అడ్డదారులు తొక్కుతున్నారు. తమ స్టేషన్‌ పరిధిలో ఏయే ఆదాయ మార్గాలు ఉన్నాయో లెక్కలు వేసి చూపుతున్నారు. మట్కా, పేకాట, ఇసుక, అక్రమ రవాణా, నాటుసారా ఇలా ఎన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయంటూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఈయనే బావున్నాడు కదా.. కొత్త వారెందుకులే అనే పరిస్థితికి ఎమ్మెల్యేల ను తీసుకువచ్చారు. మాట వినని ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేయిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరి మాట వింటారో, ఆ ఎమ్మెల్యే బంధువు ఎవరో.. వారి దూరపు చుట్ట్టరికం ఎక్కడుందో.. చూసి పైరవీ చేస్తున్నారు. ఇలా ఏ మార్గాన్నీ వదలడం లేదు. దీనికితోడు వైసీపీ నాయకులతో సఖ్యతగాఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు కూడా చేయిస్తున్నారు.

ప్రైమ్‌ స్టేషన్లకు భారీ డిమాండ్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. పాణ్యం, కర్నూలు రూరల్‌, కర్నూలు తాలుకా అర్బన్‌, బేతంచెర్ల, కోసిగి, కర్నూలు ఫోర్త్‌ టౌన్‌, టూటౌన్‌, మంత్రాలయం, ఉలిందకొండ, నంద్యాల పోలీస్‌స్టేషన్లకు భారీ డిమాండ్‌ ఉంది. ఒక్క కర్నూలు ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు సుమారు పది మంది సీఐలు పోటీ పడటం విశేషం. హైవేకు దగ్గరగా ఉన్న పాణ్యం, కర్నూలు రూరల్‌, ఉలిందకొండ పోలీస్‌స్టేషన్లకు అయితే.. సుమారుగగా ఆరుగురు పోటీ పడుతున్నారు. పూర్తిగా పశ్చిమ ప్రాంతం నిరక్షరాస్యత ప్రాంతమైన కోసిగికి కూడా భారీ డిమాండ్‌ పెరిగింది. ఆ స్టేషన్‌కు అయితే ఎంత మొత్తంలోనైనా సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుండటంతో తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఇసుక ద్వారా ఎంతైనా సంపాదించుకోవచ్చని భావించి ఈ పోటీ పెరిగింది.

లూప్‌ లైన్‌లో ఉన్న వారి పరిస్థితి ఏంటో?

ఐదేళ్ల కింద వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీ హయాంలో పని చేసిన సీఐలను పూర్తిగా పక్కన పెట్టేసింది. రెడ్లు, క్రిస్టియన్లు, ఎస్సీలకే ప్రాధాన్యం ఇచ్చింది. కాపు వర్గానికి చెందిన ఏ ఒక్కరికి కూడా కర్నూలు జిల్లాలో పోస్టింగ్‌ దక్కలేదు. కమ్మ వర్గానికి ఒకరికో ఇద్దరికో మాత్రమే ఐదేళ్లలో పోస్టింగ్‌ దక్కడం విశేషం. ఇటీవల కర్నూలు ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఓ డీఎస్పీ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఉన్నత స్థాయి ఐజీ అధికారి ఒకరు ఆ స్థానానికి మంచి డీఎస్పీ పేరును సూచించాలని కోరగా కాపు వర్గానికి చెందిన ఓ డీఎస్పీ పేరు తెలిపారు. ఆయన కాపు కదా... వద్దులేబ్బా... జగన్‌కు తెలిస్తే అంతే సంగతి అంటూ పెదవి విరిచారని, పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఓ సీఐ తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీలో పని చేసిన పలువురు సీఐలు, ఎస్‌ఐలు ఇప్పటికీ లూప్‌లైన్‌లోనే మగ్గుతున్నారు. సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్‌, రైల్వే, ట్రాన్స్‌కో ఆర్టీసీ వంటి విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క విజిలెన్స్‌లో మాత్రం కొంత పరపతి ఉన్న సీఐలు పోస్టింగులు ఇప్పించుకోగలిగారు. అది కూడా ఇతర జిల్లాల్లో మాత్రమే. ఇప్పుడు వీరంతా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పోస్టింగ్‌ దక్కుతుందని ఆశపడ్డారు. అయితే వైసీపీకి అంటకాగిన సీఐలే పోస్టింగ్‌లకు పోటీ పడుతుండటంతో వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తమకు పోస్టింగులు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో భారీగా సంపాదించుకున్న సీఐలు తిరిగి పోస్టింగులు దక్కించుకునేందుకు రూ.15 నుంచి రూ.20 లక్షల మేర ముట్టజేప్పేందుకు సిద్ధమవుతున్నారంటే వారు ఏ స్థాయిలో సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రెండు జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ముడుపులు అడుగుతుండటంతో అంతగా ఇచ్చుకోలేమని లూప్‌లైన్‌లో ఉన్న సీఐలు వెనక్కు తగ్గుతున్నారు. అంతేగాకుండా కర్నూలు జిల్లాలో వైసీపీకి అంటకాగిన సీఐలు, ఎస్‌ఐలు పక్క జిల్లాలకు వెళ్లి తాము టీడీపీకి అనుకూలమని అక్కడ పోస్టింగులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారికే తిరిగి పోస్టింగులు దక్కేలా ఉన్నాయని వీఆర్‌లో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజిలెన్స్‌కు కూడా పోటీ

విజిలెన్స్‌ విభాగానికి కూడా భారీగా పోటీ ఏర్పడింది. వైసీపీతో అంటకాగిన సీఐలు కొంత మంది ఎలాగూ తమకు టీడీపీ హయాంలో పోస్టింగ్‌ దక్కదని భావించి ముందే సర్దుకోవడం మొదలు పెట్టారు. లూప్‌లైన్‌లో ఉండడం ఇష్టం లేక.. ప్రధాన విభాగమైన విజిలెన్స్‌ దారి పట్టారు. ఇప్పటికే పలువురు సీఐలు ఉన్నత విభాగాల్లో ఉన్న అధికారులను ప్రసన్నం చేసుకుని ఆ విభాగానికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రెండు చేతులా సంపాదించి ఇప్పుడు ఖాళీగా ఉండలేమని భావించి ఆ విభాగానికి వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లు ఇవ్వకపోతే విజిలెన్స్‌కైనా రెకమెండ్‌ చేయాలంటూ పోటీ పడుతుంటం విశేషం.

కొత్త మద్యం పాలసీ వస్తుంది కదా అని..

కొత్త మద్యం పాలసీ వస్తుండటంతో మద్యం షాపులకు టెండర్లు పిలుస్తారు... ఒక్క మండల స్థాయి వైన్‌ షాపు నుంచి ఒక్కో స్టేషన్‌కు రూ.8 వేలు, సర్కిల్‌కు రూ.10 వేలు, పట్టణంలో ఉండే వైన్‌షాపు నుంచి స్టేషన్‌కు రూ.12 వేలు, ఇలా ముడుపులు గతంలో వచ్చేవి. స్టేషన్‌ పరిదిలో రెండు, మూడు వైన్‌షాపులు ఉంటే సుమారు రూ.30వేల దాకా ఆదాయం వస్తుంది. ఇక బెల్టుషాపులు ఉంటే ఆదాయం అదనం. ఒక్కో బెల్టు షాపునకు రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా వసూలు చేస్తారు. మరో పక్క ఇసుక నుంచి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ పోస్టింగ్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదోని ప్రాంతంలో మట్కా, పేకాట విచ్చలవిడిగా ఉంటుండటంతో అక్కడా కూడా భారీగా డిమాండ్‌ ఏర్పడింది. నంద్యాల జిల్లాలో ఓ పెద్దాయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే ఆ నియోజకవర్గానికి ఓ డీఎస్పీ ముందుగానే తన పోస్టును ఖరారు చేసుకున్నారు. దీంతో సదరు డీఎస్పీ తాను సూచించే సీఐలు, ఎస్‌ఐలకు పోస్టులు దక్కే అవకాశం ఉంది. తన టీంలో పని చేసే సీఐలు, ఎస్‌ఐలు ఆయనే దగ్గర ఉండి పెద్దాయనకు సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఆ అధికారి భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్లు సమాచారం. తన శిష్యులుగా ఉంటున్న కొంత మంది సీఐల పేర్లను ఆళ్లగడ్డకు కూడా రెకమెండ్‌ చేసినట్లుగా తెలిసింది. మరో పక్క కర్నూలు-నంద్యాల హైవే పరిధిలో ఓ సర్కిల్‌లో పని చేసిన సీఐ బనగానపల్లె ప్రాంతానికి పోటీ పడుతుండటం, ఆ పోస్టింగ్‌కు రూ.15 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో కొంత మంది సీఐలు విస్తుపోతున్నారు. అదే సీఐ ఆ పెద్దాయన ప్రాతినిధ్యం వహించే కేంద్రానికి పోస్టింగ్‌ ఇప్పిస్తే అదనంగా చెల్లించుకుంటానని చెప్పినట్లు సమాచారం. మరో పక్క నంద్యాల జిల్లాలో వైసీపీ హయాంలో పని చేసిన ఇద్దరు సీఐలు ఓ చోటా వైసీపీ నాయకుని మధ్య వచ్చిన విభేదాలతో అక్కడి నుంచి బదిలీ అయి ఓ మంత్రి నియోజకవర్గానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇద్దరు సీఐలు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు మార్గం సులువైంది. వైసీపీలో పని చేసినా ఆ చోటా వైసీపీ నాయకునితో ఉన్న విభేదాలే టీడీపీలో పోస్టింగ్‌లు దక్కేలా చేశాయి.

టీడీపీ నాయకులను చితగ్గొట్టినా..

కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలో గత వైసీపీ ఎమ్మెల్యే చెప్పిందే తడువుగా కొంత మంది టీడీపీ నాయకులను డీటీసీకి తీసుకెళ్లి చితగ్గొట్టారు. అయితే.. టీడీపీ నాయకులు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో వారిని విడిచిపెట్టారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘మీరు చెప్పినందుకే కదా వారిని విడిచిపెట్టాను.. మీకు అనుకూలంగా పని చేశాను కదా.. నాకు ఈసారి పోస్టింగ్‌ ఇవ్వండంటూ’ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఆ స్టేషన్‌ కాకుండా పక్క స్టేషన్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. అలాగే కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలోనే ఓ ఎమ్మెల్యే పరిధిలోని రెండు పోలీస్‌స్టేషన్‌లలో పని చేసి భారీ ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన ఓ సీఐ బనగానపల్లె ప్రాంతానికి పోస్టింగ్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే కర్నూలు నగరంలో పని చేసిన ఓ సీఐ ఇటీవల ఓ పుణ్యక్షేత్రం పోస్టింగ్‌ కోసం వెళ్లి అక్కడ ఓ వివాదంలో చుట్టుకున్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ ఫొటోలు ఉన్న ఉంగరం మాయం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ సీఐ మరోసారి కర్నూలు రూరల్‌, పాణ్యం సర్కిల్స్‌కు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్‌ ఆరా

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఐలు, ఎస్‌ఐల పోస్టింగ్‌లపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇంటెలిజెన్స్‌ వర్గాలకు పోన్లు చేసి మరీ సమాచారం సేకరిస్తున్నారు. గతంలో వైసీపీలో పని చేసిన సీఐలు ఎవరూ అందులో రెడ్లు, ఎస్సీ, క్రిస్టియన్లు ఎంత మంది ఉన్నారు.. ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ పోస్టింగ్‌లో కోసం ఆరా తీస్తున్నారో పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురవుతున్నారా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉండటంతో వారు ఏమైనా రెడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయాలన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

అన్ని వర్గాలకు పోస్టింగ్‌ ఇవ్వాలని హైకమాండ్‌ ఆదేశం

గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా రెడ్లు, ఎస్సీలు, క్రిస్టియన్లకు ఇలా కొన్ని వర్గాలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి పోస్టింగ్‌లు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర హైకమాండ్‌ ఇప్పటికే ఆదేశించింది. ఒక సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎమ్మెల్యేలు అన్ని వర్గాలు, కులాలకు చెందిన సీఐలు, ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఆ ప్రాధాన్య క్రమంలో సిఫారసు లెటర్లు ఇస్తున్నట్లు సమాచారం.

డీఐజీపైనే ఆశలు

కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఐజీ కోయ ప్రవీణ్‌పైనే పలువురు సీఐలు ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ హయాంలో నిక్కచ్చిగా నిజాయితీగా పని చేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ మొత్తం లూప్‌లైన్‌లో ఉన్న సీఐలు తమకు పోస్టింగ్‌ దక్కేలా చూడాలని డీఐజీని కోరుతున్నారు. పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే డీఐజీ.. ప్రతిభ కనబరిచే సీఐలకు మాత్రమే పోస్టింగులు ఇస్తారనే ఆశతో వారు ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న గుర్తింపు ఉంది. పత్తికొండ సబ్‌ డివిజన్‌లో పని చేసిన ఓ సీఐ టీడీపీ నాయకులను తన సర్కిల్‌ మెట్లు ఎక్కే హక్కు లేదని అప్పట్లో హుకుం జారీ చేశారు. వైసీపీకి అంటకాగిన అలాంటి వారికి పోస్టింగులు రాకుండా చూడాలని పోలీస్‌ శాఖలో చర్చగా మారింది.

Updated Date - Jul 26 , 2024 | 11:26 PM