వేతనదారుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:58 PM
ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు.
నంద్యాల కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాలు, ఇళ్లనిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు పనులు కల్పించడంలో పగిడ్యాల, కొత్తపల్లి, ఆత్మకూరు, డోన్, బెతంచెర్ల తదితర మండలాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయని, గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. హార్టికల్చరల్ ప్లాంటేషన్‌కు సంబంధించి 2900 ఎకరాలకుగాను 2200 ఎకరాలు పూర్తి చేశారని, మిగిలిన 700 ఎకరాలు పెండింగ్‌లో ఉన్న మండలాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామానికి రెండు ఫారం పాండ్స్, మండలానికి పదిచొప్పున ఫిష్ పాండ్స్, రూప్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రిక్చర్స్ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. 850 పశువుల షెడ్ల నిర్మాణాలకు గాను 751 షెడ్లకు మాత్రమే పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేస్తే 327 షెడ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్, పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నామని హౌసింగ్ డీఈలు, ఏఈలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గృహాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శిరివెళ్ల, వెలుగోడు, మండలాల్లో 90 రోజుల హౌసింగ్‌లో కూడా ప్రగతి లేదని అన్నారు. లబ్ధిదారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.