బాబోయ్ దొంగలు..!
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:41 AM
కర్నూలు మార్కెట్ యార్డులో గిట్లుబాటు ధర లభిస్తుందనే నమ్మకంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకు వస్తున్నారు.
రెండేళ్లుగా పని చేయని సీసీ కెమెరాలు
పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి రైతుల అవస్థలు
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో గిట్లుబాటు ధర లభిస్తుందనే నమ్మకంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకు వస్తున్నారు. అయితే.. కొంత మంది కేటుగాళ్లు పంట ఉత్పత్తులను ఎత్తుకెళ్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రిపూట దొంగలు యార్డులో చొరబడి ఉల్లిగడ్డలు, వాము, తదితర వాటిని తీసుకెళ్తున్నారు. దొంగలను అదుపు చేయడంలో మార్కెట్ యార్డు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో యార్డులో 73 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సీసీ కెమెరాలను సక్రమంగా పని చేయడం లేదు. 73 సీసీ కెమెరాలకు గాను 40 సీసీ కెమెరాలే యార్డులో కనిపిస్తున్నాయి. కనీసం ఉన్న సీసీ కెమెరాలనైనా యుద్ధ ప్రాతిపదికన రిపేరు చేయించి తమ పంట ఉత్పత్తులను దొంగల బారి నుంచి కాపాడాలని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం
గతంలో రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులకు భద్రత ఉండేది. ఇటీవల దొంగల బెడద ఎక్కువైంది. రాత్రిపూట ఉల్లిగడ్డలతో పాటు తదితర పంట ఉత్పత్తుల ను కేటుగాళ్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. రెండేళ్లుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. 73 సీసీ కెమెరాలకు గాను 40 మాత్రమే ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన రిపేరి చేయించి పంట ఉత్పత్తులకు భద్రత కల్పిస్తాం. అదే విధంగా ఫోర్త్ టౌన్ పోలీసులు రాత్రి పూట యార్డులో తనిఖీకి వచ్చేలా చూడాలని పోలీసు అధికారులను కోరాం. - జయలక్ష్మి, మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ