మచిలీపట్నం మెడికల్ కాలేజీకి..పింగళి వెంకయ్య పేరు
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:00 AM
రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం ప్రముఖుల పేర్లు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం ప్రముఖుల పేర్లు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులిచ్చారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వ హయంలోనే విజ్ఞప్తులు వచ్చాయి. కానీ జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు.