శిక్షణ లేకుండా పోలీసింగ్ సాధ్యమా?
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:05 AM
అసెంబ్లీలో అధికార పక్షమే ప్రతిపక్షమయింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు.
మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో విలీనం తుగ్లక్ చర్య: మంత్రి అనిత
డీఎస్సీ నియామకాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి లోకేశ్
ప్రశ్నలు, సమాధానాలు క్లుప్తంగా ఉండాలి: స్పీకర్ అయ్యన్న
అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో మంత్రులపై ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యేలు
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో అధికార పక్షమే ప్రతిపక్షమయింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు. మహిళా పోలీసుల సమస్యపై ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌరు చరిత, మాధవీ రెడ్డి, కూన రవి కుమార్ తదితరులు మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో 15,000 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా పోలీసు శాఖలోకి మార్చింది. వారితో బలవంతంగా యూనిఫామ్ వేయించి క్షోభకు గురి చేసింది. పోలీసు నియామకాలు, శిక్షణ, విధి నిర్వహణలో జాబ్ చార్ట్ ఏంటో హోం మంత్రి వివరించాలి. పోలీసు శాఖలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలి’ అని అడిగారు. దీనిపై హోం మంత్రి అనిత స్పందిస్తూ... ‘శాంతి భద్రతల్ని పరిరక్షించే పోలీసుల ఎంపికలో దేహధారుఢ్య పరీక్షలు ఉంటాయి. ఎంపికైన వారికి కఠిన శిక్షణ ఉంటుంది. కనీస ఫిట్నె్సలేని వారిని తీసుకొచ్చి పోలీసు శాఖలో విలీనం చేసిన జగన్ ఈ తరం తుగ్లక్. మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన వారిని పోలీసు శాఖలో విలీనం చేయడం సరికాదు’ అని అన్నారు.
చింతలపూడి రెండేళ్లలో పూర్తి చేస్తాం: నిమ్మల
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో సాగు, తాగు నీటి సమస్య తరచూ ఇబ్బంది పెడుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ‘చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తాం.’ అని తెలిపారు. .
విశాఖ మెట్రో ప్రతిపాదనలు సిద్ధం: నారాయణ
కేంద్ర ప్రభుత్వానికి పంపి విశాఖవాసుల మెట్రో కల సాకారం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. గాజువాక, అనకాపల్లి ఎమ్మెల్యేలు పల్లా శ్రీను, కొణతాల రామకృష్ణ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై వివరణ ఇచ్చారు.
వైసీపీ నిర్లక్ష్యం... గిరి వర్సిటీకి శాపం: లోకేశ్
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ‘డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాలేదు.’ అని అన్నారు. గిరిజనుల సమస్యలపై మిరియాల శిరీషా దేవి, కోళ్ల లలిత కుమారి, గౌతు శిరీష, తోయక జగదీశ్వరి, వరుపుల సత్యప్రభ, అదితీ గజపతిరాజు తదితరులు మాట్లాడారు. మన్యంలో డోలీల మోత ఆగెదెన్నడు? అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రిసుధారాణి స్పందిస్తూ...‘గిరిజన ప్రాంతాల్లో చంద్రబాబు హయాం లో కాఫీతోటలు సాగైతే, జగన్ గంజాయిసాగు చేయించారు.’ అని అన్నారు. .
అదితి ప్రశ్న... లోకేశ్ సమాధానం... భేష్: స్పీకర్ అయ్యన్న
ప్రశ్నోత్తరాల ముగింపులో సభాపతి అయ్యన్న మాట్లాడుతూ, ‘సభ్యుల సుదీర్ఘ ప్రసంగాలతో సమయం వృథా అవుతోంది. సభ్యులు క్లుప్తంగా సమస్యలు సభ దృష్టికి తీసుకొస్తే అంతే క్లుప్తంగా మంత్రులు సమాధానం ఇవ్వాలి. ఈ రోజు (బుధవారం) ప్రశ్నోత్తరాల్లో విజయనగరం ఎమ్మెల్యే అదితీ గజపతిరాజు చాలా క్లుప్తంగా సమస్యను సభ దృష్టికి తెచ్చారు. మంత్రుల్లో నారా లోకేశ్ చెప్పాల్సిన సమాధానం సూటిగా చెప్పారు’ అని సభాపతి ప్రశంసించారు.