తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందుకు సన్మానం చేయాలా?
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:50 AM
తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి... ట్రూ అప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాదేసినందుకు సన్మానం చేయాలా? అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు.
మంత్రి గొట్టిపాటి
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి... ట్రూ అప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాదేసినందుకు సన్మానం చేయాలా? అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాటాడారు. ‘జగన్... రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏం చేశారు? వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆయన అవినీతి కార్యకలాపాలతో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కు వెళ్లిపోయింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు వ్యవస్థపై రూ.లక్షల కోట్ల అర్థిక భారం పడింది’ అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. శనివారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో పాటు ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు షాక్‌తో ఏ ఒక్కరి ప్రాణమూ పోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు పోల్స్, తీగలను అందుబాటులో ఉంచుకోవాలని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.