Share News

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:20 AM

కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్‌ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

  • బియ్యం స్మగ్లింగ్‌ వెనుక భారీ నెట్‌వర్క్‌

  • మాఫియా వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు

  • పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల హెచ్చరిక

అమరావతి/తెనాలి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్‌ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వెనుక భారీ నెట్‌వర్క్‌ పనిచేస్తోందని చెప్పారు. కాకినాడ సీపోర్టులోకి అరబిందో రియాలిటీ ఏవిధంగా వచ్చింది? కాకినాడ ఎస్‌ఈజడ్‌ను జీఎంఆర్‌ నుంచి ఎందుకు లాగేసుకున్నారు? మానస సంస్థకు కాకినాడ పోర్టులో 7 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించారు? కాకినాడ సీపోర్టును బలవంతంగా లాక్కున్న అరబిందో రియాలిటీ సంస్థకు బాస్‌ ఎవరు? పనిగట్టుకుని కాకినాడకు చెడ్డపేరు తెచ్చిందెవరు? కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ డెన్‌గా మార్చిందెవరు? అని మంత్రి ప్రశ్నలు సంధించారు. రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిన కాకినాడ సీపోర్టును తమ కబందహస్తాల్లోకి లాక్కుని దందా చేయడానికి ముందస్తుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ యజమాని కేవీ రావు కుటుంబాన్ని బెదిరించి, వారి మెడ మీద కత్తి పెట్టి 41.12 శాతం వాటాను అరబిందో రియాలిటీకి బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు.


తాజాగా కాకినాడ పోర్టులో 640 టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసిన షిప్‌ను పరిశీలించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ చేసిన ప్రయత్నాలకు అడ్డుపడిన వారి వెనుక ఎవరున్నారనే ది కూడా ప్రజలకు అర్థం కావాలన్నారు. ‘‘గత ఐదేళ్లలో పాతుకుపోయిన బియ్యం మాఫియా పకడ్బందీ వ్యూహంతో మీడియా సహా ఎవరినీ పోర్టు లోపలకు అనుమతించలేదు. దీనికి వెనుక పెద్ద కుట్ర ఉంది. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం సరఫరా చేయడానికి 29 వేలకుపైగా చౌక దుకాణాలు ఉండగా.. జగన్‌ ప్రభుత్వం డోర్‌ డెలివరీ పేరుతో 9,260 వ్యాన్లు కొనుగోలు చేసి రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.1,600 కోట్ల నష్టం చేకూర్చింది. ఇంటింటికీ రేషన్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల ద్వారానే రేషన్‌ బియ్యాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి లారీల ద్వారా అక్రమంగా తరలించిన ఉదంతాలు ఆధారాలతో సహా ఉన్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్‌ బియ్యం సేకరణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ రహదారులపై గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసుకుని నేరుగా కాకినాడ పోర్టుకు తరలించారు. కాకినాడ పోర్టు నుంచే బియ్యం ఎగుమతులు జరిగాయి. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచి ఏకంగా కోటీ 38 లక్షల 18వేల 346 టన్నుల బియ్యం ఎగుమతి చేశారు.


గత మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసిన బియ్యం విలువ 48,537 కోట్లు. దీనిని బట్టి రేషన్‌ బియ్యం మాఫియా ఏస్థాయిలో దుర్మార్గాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. అరబిందో సంస్థ కాకినాడ సీపోర్టును స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచే కోటీ 31 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు చేశారంటే అందరూ ఆలోచించాలి. బియ్యం స్మగ్లింగ్‌ మాఫియా వెనుక ఎంతటి శక్తులున్నా వదిలిపెట్టం. అన్నీ బయటకు తీస్తాం’’ అని మంత్రి మనోహర్‌ హెచ్చరించారు. ఇప్పటికి 1000 కేసులు నమోదు చేశామన్నారు.

  • ఆ మిల్లర్లు బ్లాక్‌ లిస్ట్‌లోకే!

ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొన్నిచోట్ల మిల్లర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. తుఫాన్‌ కారణంగా పంట దెబ్బతిని రైతులు కష్టంలో ఉన్నారని, వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. మిల్లర్లపై రైతుల నుంచి ఫిర్యాదు అందితే వెంటనే ఆ మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. ఆదివారం తెనాలిలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్ముకునే విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? డబ్బు పడే విషయంలో సమస్యలు ఉ న్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అయితే, మిల్లర్లు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ధాన్యం కొనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా మిల్లర్లు ఇంకా సాకులు చూపటం దారుణమన్నారు. 25 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాల్సిందేనని మిల్లర్లను ఆదేశించారు.

Updated Date - Dec 02 , 2024 | 04:20 AM