Share News

Nara Lokesh: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:16 PM

రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

అమరావతి: రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో అసలు ఏం జరిగింది?. విద్యార్థినులు ఎందుకు అంతలా ఆందోళన చెందారు?. హిడెన్ కెమెరా ద్వారా పెద్ద ఎత్తున వీడియోలు లీక్ అయ్యాయనే ప్రచారం ఎలా మొదలైంది?. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?.. ఇలా అన్ని అన్ని అంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.


అయితే విపక్ష వైఎస్సార్‌‌సీపీ మాత్రం ఏదో జరిగిపోయింది అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కుట్రపూరిత దుష్ప్రచారాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆదివారం) మంగళగిరిలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌ను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఘటనపై మీడియా ప్రశ్నించగా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో హిడెన్ కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదని మంత్రి సమాధానం ఇచ్చారు.


మంత్రి లోకేశ్ ఏమన్నారంటే?

హిడెన్ కెమెరా అని చెప్పారు కదా అని జాతీయ మీడియాను అడిగితే.. ఎవరో ఇచ్చారంటూ వారు సమాధానం ఇచ్చారని, అంటే వైసీపీ వాళ్లే ఇచ్చారని మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దొరికిపోయింది. ఏదో అయిపోయింది. ఏదో అయిపోందని ప్రచారం. వీడియో ఎక్కడ ఉందంటే ఎవరికీ తెలియదు. కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 300 వీడియోలు బయటకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఒక్క వీడియో అయినా ఎవరి చేతుల్లోనైనా ఉందా అంటే లేదు. పిల్లల అందరి ఫోన్లు జప్తు చేసి పరిశీలించినా ఒక్క వీడియో దొరకలేదు. లేని వీడియోకు నేనెలా సమాధానం చెబుతాను’’ అని మంత్రి లోకేశ్ వివరణ ఇచ్చారు.


ఇష్యూ జరిగింది కరెక్టేనని, నలుగురి మధ్యలో ఇష్యూ ఉందని, నలుగురి మధ్య లవ్‌స్టోరీలో ఏ చర్యలు తీసుకోవాలో అధికారికంగా ఆ చర్యలు తీసుకుంటామని మంత్రి వివరణ ఇచ్చారు. కానీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో కెమెరా లేదని, వీడియోలు అంటూ ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎస్‌ఐ శిరీషపై సస్పెన్షన్ వేటు..

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో ఇవాళ ఉదయం మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. విద్యార్థినుల పట్ల ఆగ్రహంతో, ఊగిపోతూ మాట్లాడిన ఎస్ఐ శిరీష తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమైన ఈ వ్యవహారంలో శనివారం రాత్రి బందోబస్తు కోసం వెళ్లిన ఎస్ఐ.. విద్యార్థులతో ఇష్టానుసారం మాట్లాడిన విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో శిరీషను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. విద్యార్థినుల ఆవేదన బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా.. వారితోనే దురుసుగా ప్రవర్తించడం ఏంటి?’’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని శిరీషకు సీఎం క్లాస్ తీసుకున్నారు. దీంతో బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ శిరీషను అధికారులు తిప్పి పంపారు. కాగా ఈ ఘటనపై విచారణ అధికారిగా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 01 , 2024 | 03:24 PM