Share News

Somireddy: వారిద్దరిలో ఒకరు ప్యాలెస్‌కు.. మరొకరు ఫామ్ హౌస్‌కు పరిమితం

ABN , Publish Date - Jul 06 , 2024 | 09:56 AM

సీఎంల భేటీపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హాట్ టాపిక్ అవుతోంది.

Somireddy: వారిద్దరిలో ఒకరు ప్యాలెస్‌కు.. మరొకరు ఫామ్ హౌస్‌కు పరిమితం

అమరావతి: సీఎంల భేటీపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సీఎంలుగా వ్యవహరించిన వారిలో ఒకరు ప్యాలెస్‌కు, మరొకరు ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంతలను తలపించారన్నారు. ప్రస్తుత సీఎంలు ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా నేడు ప్రజా భవన్‌లో చర్చలు జరపబోతున్నారని సోమిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఇక మంచిరోజులు... తెలుగు జాతికి నిండు వెలుగులు రావడం ఖాయమని సోమిరెడ్డి పేర్కొన్నారు.


సుదీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన ఎంజెడాను ఇరువురు సీఎంలు సిద్ధం చేసుకున్నారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించడం తెలిసిందే.

Updated Date - Jul 06 , 2024 | 09:57 AM