Share News

Madanapalle Incident: సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు?

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:00 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

Madanapalle Incident: సర్కారు చేతికి పెద్దిరెడ్డి గుట్టు?
Madanapalle Incident

  • హైదరాబాద్‌లోని శశికాంత్‌ ఇంట్లో తనిఖీలు

  • 4 ట్రంకు పెట్టెల్లోని కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు సీజ్‌

అమరావతి/తిరుపతి/రాయచోటి/మాదాపూర్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో (Madanapalle Incident) పోలీసులు కీలక పురోగతి సాధించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శశికాంత్‌ (ఆలియాస్‌ శశి)ను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్లిన పోలీసులకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. పది మంది పోలీసులు దాదాపు 8గంటల పాటు నిర్వహించిన సోదాల్లో మొత్తం నాలుగు ట్రంకుపెట్టెల్లో ఫైళ్లు, డాక్యుమెంట్లను గుర్తించారు. వాటితో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసి అమరావతికి తరలించారు. వాటిలో గనుల శాఖతో పాటు, మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల భూముల ఫైళ్లు, రికార్డులు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఫైళ్ల దహనం కేసులో ఈ పరిణామం చాలా కీలకమైనదిగా ప్రభుత్వం భావిస్తోంది. పెద్దిరెడ్డికి శశికాంత్‌ నమ్మిన బంటు. జగన్‌ ప్రభుత్వంలో గనులు, అటవీ శాఖలకు పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ అసలు మంత్రిగా శశినే వ్యవహరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గనుల శాఖలో విజిలెన్స్‌ దాడులు, వసూళ్లు, బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో గోల్‌మాల్‌, వ్యాపారులను బెదిరించడం, అడ్డగోలుగా లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌లు ఇప్పించారని ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఆర్‌ఆర్‌ రెసిడెన్సీకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన శశి తన ఫ్లాట్‌కు తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. ఫ్లాట్‌ యజమాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో పోలీసులు తాళాలు తెరిచారు. మరోవైపు ఓ బృందం శశి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది.

madana-palli-fire.jpg

వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు

తిరుపతి నగరం మంగళం రోడ్డులోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారాం నివాసంలో ఆదివారం పోలీసులు, సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 4గంటలపాటు క్షుణ్నంగా సోదాలు చేసి 15 కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకుని మదనపల్లె తరలించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, సీఐడీ సీఐ రామకిశోర్‌ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, శనివారం అర్ధరాత్రి తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇంట్లో సోదాలు జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిసింది. ఇక్కడ పోలీసులకు ఎటువంటి రికార్డులు, డాక్యుమెంట్లు దొరకలేదని సమాచారం. ఆదివారం తెల్లవారుజామున 5గంటల సమయంలో వైసీపీకి చెందిన మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంటికి పోలీసులు వెళ్లారు. బెంగళూరులో ఉన్న ఆయన సాయంత్రం 5గంటల ప్రాంతంలో తిరిగి వచ్చారు. అప్పటినుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డితో ఏమైనా భూ లావాదేవీలు జరిపారా? అనే కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి పలుచోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాధవరెడ్డి కోసం ప్రత్యేక బృందాలతో వేట కొనసాగుతోంది.

Madanapalle-case.jpg


మదనపల్లె ఘటనకు సంబంధించి మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - Jul 29 , 2024 | 07:32 AM