Share News

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:18 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు...

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం.. తాజాగా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘కాళ్లకు దండం పెట్టే సంస్కృతి’ ని విడనాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన బాబుకు వినతీ పత్రాలు ఇస్తూ ప్రజలు.. సీఎం కాళ్ల మీద పడ్డారు. దీంతో ఒకింత ఆవేదనకు లోనైన చంద్రబాబు ఇదే కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.


Chandrababu-F.jpg

నాకు కాదు.. భగవంతుడికే..!

నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లు మొక్కాలి. నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు. ఈ రోజు నుంచి ఎవరు అలా చేయవద్దు. ఈ దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాఅని రాష్ట్ర ప్రజలకు సీఎం సూచించారు. అంతకుముందు.. పార్టీ కార్యాలయంలో ప్రజలను కలిసే సమయంలో చంద్రబాబుకు పలువురు కాళ్లకు మొక్కారు. దీంతో తన కాళ్ళకు మొక్క వద్దని ఇదే కార్యక్రమంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ క్రమంలో.. సెక్యూరిటీ సిబ్బందిని కూడా పార్టీ నేతలు అప్రమత్తం చేశారు.


Chandrababu-L.jpg

నేను కూడా..!

ఈ సంస్కృతిని వీడాలని చెప్పినా.. వినకుండా ఎవరైనా దండం పెడితే మాత్రం ఏం చేస్తారనే విషయాన్ని కూడా బాబు చెప్పారు. ‘నా కాళ్ళకు ఎవరైనా దండం పెడితే.. మరల నేను వారి కాళ్ళకు దండం పెడతాను’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచే.. తనతో పాటు నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని దయచేసి విడనాడాలని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం మాట్లాడుతున్నంత సేపూ ఈలలు, కేకలతో కార్యకర్తలు, వీరాభిమానులు, టీడీపీ నేతలు ఈలలు.. కేకలతో హోరెత్తించారు. అయినా.. ఇలా ట్రెండ్‌లు సెట్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 01:42 PM